ప్రపంచ క్రికెట్లో ఏబీ డివిలియర్స్ ఎంత ప్రత్యేకమైన ఆటగాడో ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిస్టర్ 360గా పేరున్న ఈ లెజెండ్ మైదానంలో అన్నివైపులా షాట్లు కొట్టడంలో సిద్ధహస్తుడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్.. లీగ్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. అంటే ఇకపై ఐపీఎల్‌లో ఏబీడీ మెరుపులు చూడలేం.
కానీ ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్‌లో అచ్చం ఏబీ డివిలియర్స్ తరహా బ్యాటింగ్ స్టైల్‌తో అదరగొట్టాడు దక్షిణాఫ్రికాకే చెందిన యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్. ఇతడిని అభిమానులు ఇప్పటికే ‘బేబీ ఏబీ’ అని పిలవడం కూడా ప్రారంభించారు.
డెవాల్డ్ బ్యాటింగ్ చేసే విధానం, స్టాన్స్, క్రీజులో అటూ ఇటూ కదులుతూ షాట్లు కొట్టడం ఇవన్నీ ఏబీ డివిలియర్స్‌ను తలపిస్తున్నాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనే అతను 65 పరుగులతో అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగులు సాధించాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో కూడా 88 బంతుల్లోనే 97 పరుగులు సాధించినా.. మిగతా ఆటగాళ్ల నుంచి సపోర్ట్ రాకపోవడంతో దక్షిణాఫ్రికా ఓటమి పాలై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. దక్షిణాఫ్రికా డగౌట్‌లో కూడా ‘బేబీ ఏబీ’ అనే ప్లకార్డును ప్రదర్శించారు.
2022 అండర్ 19 ప్రపంచకప్‌లో 90 సగటుతో 362 పరుగులను బ్రెవిస్ సాధించాడు. తన స్ట్రైక్ రేట్ 86గా ఉంది. ఒక సెంచరీ, మూడు అర్థ సెంచరీలను కూడా అతను సాధించాడు. ఏబీ డివిలియర్స్‌కు తను పెద్ద ఫ్యాన్ అని కూడా డ్రెవిస్ గతంలోనే తెలిపాడు. ఏబీ డివిలియర్స్ అనుమతి తీసుకుని మరీ తన జెర్సీ నంబర్ ‘17’ను డెవాల్డ్ బ్రెవిస్ ఉపయోగిస్తున్నాడు. ఐపీఎల్‌లో కూడా ఏబీ డివిలియర్స్ ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకే ఆడాలని ఉందని కూడా డెవాల్డ్ ఆశ పడుతున్నాడు. మరి మెగా వేలంలో తనకు ఆ అవకాశం దొరుకుతుందో లేదో మరి!