కొత్త పీఆర్సీపై ఏపీలో ఉద్యోగులు బెట్టు వీడడంలేదు. జీతాల ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలు ససేమీరా అంటున్నారు. 25వ తేదీకే పూర్తి కావాల్సిన ప్రాసెస్ 30వ తేదీ వచ్చినా ఇంకా కొనసాగుతోంది. ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా ట్రెజరీ ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించడలేదు. దీంతో ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు జీతాల ప్రాసెస్ కు సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఆదివారం విధులకు హాజరవ్వాలని శనివారం రాత్రి వాట్సప్ మెసేజ్ పంపినట్లు సమాచారం. దీంతో ట్రెజరీ ఉద్యోగులు సెలవు రోజున కూడా విధులకు హాజరయ్యారు. ఉద్యోగులు జీతాలు ప్రాసెస్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థికశాఖ శనివారం మెమోలు జారీ చేసింది. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పీఆర్సీ జీతాల్లో కొత్త రూపాయి కూడా తగ్గదని ఇప్పటికే మంత్రులు పలుమార్లు స్పష్టం చేశారు. ఉద్యోగులను చర్చలను కావాలని మంత్రులు కమిటీ కోరుతోంది. అయితే పీఆర్సీ జోవోలు రద్దు చేస్తే చర్చలని ఉద్యోగుల సంఘాలు చెబుతున్నాయి. 


కఠిన చర్యలుంటాయని మౌఖిక ఆదేశాలు


ఉద్యోగుల సమ్మె కారణంతో జీతాల ప్రాసెస్ కు ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలు సహకరించడంలేదు. సుమారు 4.5 లక్షల బిల్లులకు కేవలం 1.10 బిల్లులను అయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం పలుమార్లు ట్రెజరీ ఉద్యోగులను హెచ్చరించింది. చివరకి అధికారులపై చర్యలు ఉంటాయని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు కూడా ఇచ్చారు. 11వ పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు అప్‌లోడ్‌ చేయకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని గట్టి సంకేతాలు పంపారు. దీంతో సెలవు రోజున ఆదివారం ట్రెజరీ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ముందుగా జడ్జిలు, పోలీసు, మున్సిపల్‌ ఉద్యోగుల జీతాల బిల్లులను అప్‌లోడ్‌ చేస్తున్నారు. 


ఉద్యోగులకు మెమోలు


ఫిబ్రవరి 1వ తేదీ వస్తుండడంతో ఉద్యోగుల జీతాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుపడుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఉంటాయని ప్రభుత్వం అంటోంది. అయితే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలంటూ ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులకు, డీడీవోలకు పలుమార్లు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. అయితే శనివారం ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తక్షణమే జీతాలు ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. పీఆర్సీపై ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్న ఉద్యోగ సంఘాలు, 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు రంగం సిద్ధం చేస్తున్నాయి.