Brij Bhushan: ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్‌లో చైనా వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా క్రీడలకు గాను భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలకు ట్రయల్స్ నుంచి మినహాయింపు ఇవ్వడం తీవ్ర దుమారానికి దారి తీసింది. మహిళల 53 కిలోల విభాగంలో వినేశ్, పురుషుల 65 కిలోల విభాగంలో భజరంగ్‌లు ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడలను ఆడేందుకు గాను భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అడ్ హక్ ప్యానెల్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తాజాగా దీనిపై స్పందించారు.
వాళ్లందరికీ బాధ కలిగించేదే..
అడ్ హక్ ప్యానెల్ నిర్ణయంపై బ్రిజ్‌భూషణ్ స్పందిస్తూ.. ‘ప్యానెల్ తీసుకున్న ఈ నిర్ణయం నాకు బాధ కలిగించింది. నా ఒక్కడికే కాదు, రెజ్లింగ్ ఆటను ఇష్టపడేవారందరికీ ఇది బాధించే విషయమే. రెజ్లింగ్‌ను దేశంలో చాలామంది కెరీర్‌గా ఎంచుకోవడమే గాక రేయింబవళ్లు కష్టపడి దేశం కోసం ప్రాతినిథ్యం వహించేందుకు కష్టపడుతున్నారు. అథ్లెట్లు, వారి కుటుంబాలు దీనికోసం ఎన్నో కలలు కంటున్నాయి. నేడు భారత్‌కు ఒలింపిక్ మెడల్స్ అందిస్తున్న క్రీడల్లో రెజ్లింగ్ కూడా ఒకటి. కానీ తాజాగా అడ్ హక్ ప్యానెల్ తీసుకున్న నిర్ణయంతో చాలా మందిని నైరాశ్యంలో ముంచెత్తేదే. ఇది చాలా దురదృష్టకరం..’అని తెలిపారు.
స్పందించిన ఢిల్లీ కోర్టు..
ఐవోఏ నిర్ణయంపై అండర్ - 23 ఆసియా ఛాంపియన్ సుజీత్ కల్కల్, అండర్ - 20 వరల్డ్ ఛాంపియన్ అంతిమ్ పంఘల్ న్యాయ పోరాటానికి దిగారు. ఎలాంటి ట్రయల్స్ లేకుడా ఆ ఇద్దరినీ ఎంపిక చేయడంపై ఈ ఇద్దరూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నేడు బాధితుల తరఫున వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు.. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించాలని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన ఈ ఇద్దరినీ నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేశారో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
ఇదిలాఉండగా.. బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా రెండు నెలల క్రితం రెజ్లర్లు న్యాయపోరాటం చేసిన విషయం తెలిసిందే. ఈ పోరాటాన్ని నడిపించినవారిలో వినేశ్, భజరంగ్ ముందు ఉండేవారు. వీరిని మాత్రమే ఆసియా క్రీడల్లో నేరుగా ఎంపిక చేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది. వీరిని బుజ్జగించేందుకే డబ్ల్యూఎఫ్ఐ, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇలా చేస్తుందన్న వాదనలూ ఉన్నాయి. కాగా వీరితో పాటు సాక్షి మాలిక్ కూడా పోరాటంలో ముందున్నా ఆమె మాత్రం ట్రయల్స్‌లో పాల్గొనాల్సి ఉంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial