ఇంట‌ర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్(Google) నేటితో  25 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2ఈ  సంద‌ర్భంగా ఆ సంస్థ ఎక్కువ మంది సెర్చ్ చేసిన విష‌యాల‌పై ఒక వీడియోను తన ఎక్స్ అకౌంటు లో షేర్ చేసింది. అందులో భాగంగానే  మోస్ట్ సెర్చ్‌డ్ క్రికెట‌ర్(Most Searched Cricketer), మోస్ట్ సెర్చ్‌డ్ అథ్లెట్(Most Searched Athlete)  వివ‌రాల‌ను వెల్ల‌డించింది.


విరాట్‌ కోహ్లీ క్రికెట్‌ ప్రపంచానికే కాదు అసలు ఎవరికీ  కూడా పరిచయం అక్కర్లేని పేరు. ఈ రన్ మెషీన్  గురించి చాలా  చిన్న విషయమైనా అభిమానులకు ఆసక్తే. ఆ విషయాలు తెలుసుకోవడానికి తెగ గూగుల్ చేస్తుంటారు. అందుకే గూగుల్‌ (Google) పాతికేళ్ల చరిత్రలో అత్యధిక మంది శోధించిన క్రికెటర్‌గా విరాట్‌ టాప్‌లో నిలిచాడు.


గత నెలలో భారత్‌ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అద్భుత ఆటతీరుతో ఆ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నవ చరిత్ర లిఖించాడు. సచిన్‌‌కు దరిదాపుల్లో నిలిచే బ్యాటర్ రావడం కష్టమని క్రీడా పండితులు తేల్చేశాక తానున్నానని దూసుకొచ్చిన విరాట్‌ కింగ్‌ కోహ్లీ... ఆ క్రికెట్‌ దేవుడి రికార్డును సగర్వంగా దాటేశాడు. ప్రపంచకప్‌ సెమీఫైనల్లో తీవ్ర ఒత్తిడిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత శతకంతో సచిన్‌ రికార్డును అధిగమించేశాడు. సచిన్‌ సృష్టించిన రికార్డులను తన పరుగుల ప్రవాహంతో బద్దలు కొట్టిన కోహ్లీ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును కూడా తిరగరాసి తన పేరిట లిఖించుకున్నాడు. ఇదే ప్రపంచకప్‌లో సచిన్‌ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లీ... 50 సెంచరీలతో దానిని అధిగమించాడు. తాను ఎంతటి గొప్ప ఆటగాడినో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటి చెప్పాడు. డిసెంబర్‌ నెలకు గానూ ప్రముఖ మ్యాగజైన్ ఔట్‌లుక్ బిజినెస్ రూపొందించిన ఛేంజర్ మేకర్స్-2023 జాబితాలో విరాట్‌ కోహ్లీకి చోటు దక్కింది. భారత్‌లో అత్యంత ప్రభావవంతంగా మార్పు తీసుకురాగల వ్యక్తులతో ఔట్‌ లుక్‌ బిజెనెస్‌ ఈ జాబితా రూపొందించగా అందులో కోహ్లీకి స్థానం దక్కింది.


ఇక, అత్యధిక మంది శోధించిన అథ్లెట్‌గా ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అగ్ర స్థానంలో ఉన్నాడు. అత్యధిక మంది వెతికిన ఆటగా ఫుట్‌బాల్‌ నిలిచింది. పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు, లెజెండ్‌ క్రిస్టియానో రొనాల్డో తాజాగా ప్రొఫెష‌న‌ల్ ఫుట్‌బాల్‌లో 1200వ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నూతన చరిత్ర సృష్టించాడు. ఆల్ న‌స్రీ క్లబ్ త‌ర‌ఫున ఆడుతున్న రొనాల్డో సౌదీ ప్రో లీగ్‌లో ఈ ఘనత సాధించాడు. అల్ రియాద్‌తో జరిగిన మ్యాచ్‌తో 1200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ ద్వారా అత్యధిక ఫుట్‌బాల్‌ ప్రొఫెష‌న‌ల్ మ్యాచ్‌లు ఆడిన రెండో ఆట‌గాడిగా క్రిస్టియానో రొనాల్డో రికార్డు నెల‌కొల్పాడు. అంతేకాదు  క్రిస్టియానో రొనాల్డో రాక ముందు అల్‌-నాసర్‌ జట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య కేవలం 8.6 లక్షలు మాత్రమే. కనీసం మిలియన్‌ కూడా లేదు. కానీ, డీల్‌ జరిగిన నాటి నుంచి దాని ఇన్‌స్టాగ్రామ్‌కు ఫాలోవర్ల సునామీ మొదలైంది. ఆ సంఖ్య మిలియన్లలో పెరుగుతోంది. డీల్‌ జరిగిన 48 గంటల్లో దాదాపు 30 లక్షలకు చేరగా.. 72 గంటల్లో అది 78 లక్షలకు ఎగబాకింది. హాప్పర్ హెచ్‌క్యూ ప్రకారం, ఈ పోర్చుగల్ ఆటగాడు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో 600 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ప్రతి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు $3.23 మిలియన్లు చార్జ్ చేస్తున్నాడు.