AP Govt gives good news to APSRTC employees: ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. వైనాట్ 175 అన్న టార్గెట్ పెట్టుకుని దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా... ఓవైపు పార్టీలో మార్పులు చేర్పులు చేసుకుంటోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మారుస్తోంది. మరోవైపు పలు రంగాల్లో సమస్యలపై ఫోకస్ పెట్టింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపింది. ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంది.
జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైనది... ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలతోపాటు అలవెన్సుల చెల్లింపులు చేయడం. ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత.. ఉద్యోగులకు జీతాలు, అలవెన్సులు వేరువేరుగా ఇస్తున్నారు. అలా కాకుండా... విలీనానికి ముందు ఉన్నట్టే జీతాలు, అలవెన్సులు ఒకేసారి చెల్లించాలని ఎప్పటి నుంచో ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వీటిపై చర్చించిన జగన్ సర్కార్... సానుకూల నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెలా... ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలతోపాటే అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించింది. డ్యూటీ బేస్డ్ అలవెన్సులను జీతాలతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు ఖజానా శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. వచ్చే నెల అంటే... 2024 జనవరి నుంచే ఈ విధానం అమలు చేయాలని కూడా స్పష్టం చేసింది. వచ్చే నెల నైట్ అవుట్, డే అవుట్ అలవెన్సులు, ఓవర్ టైమ్ అలవెన్సులను కూడా జీతాలతోపాటే చెల్లించనుంది. దీని వల్ల... 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
ఇది మాత్రమే కాదు... ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు, ఎస్‌ఆర్‌బీఎస్ ట్రస్టుకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా త్వరలోనే దశలవారీగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు ప్రమోషన్లకు కూడా త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనుంది. ప్రభుత్వంలో విలీనానికి ముందు అంటే 2020 జనవరి 1కి ముందు నుంచి ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్న వారికి పదోన్నతులు కల్పించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా త్వరలోనే జారీ చేయనుంది ఏపీ ప్రభుత్వం.
ఇక.. ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాయి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా క్రమశిక్షణ చర్యలు అమలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పుకున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. క్రమశిక్షణ చర్యలపై ఆర్టీసీ ఉద్యోగులు అప్పీల్ చేసుకునేందుకే కాకుండా... ఆ తర్వాత కూడా సమస్యను త్వరగా పరిష్కరించేలా విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దానిపై రూపొందించిన ముసాయిదాను ఇప్పటికే న్యాయశాఖ పరిశీలనకు పంపారు. త్వరలోనే క్రమశిక్షణ చర్యలపై ప్రత్యేకంగా అప్పీళ్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయనుంది.
ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు అన్నింటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. పరిష్కార మార్గాలు చూడటంతో... ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. డ్యూటీబేస్డ్ అలవెన్సులను ప్రతి నెల జీతాలతోపాటు చెల్లించడం ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.