ODI WC 2023 Anthem: టీమిండియా వెటరన్  స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌తో పాటు త్వరలో మొదలుకాబోయే ఆస్ట్రేలియా వన్డే సిరీస్, వన్డే ప్రపంచకప్‌లలో కూడా  చోటు దక్కించుకోలేకపోయాడు. చాహల్‌ను  వన్డే టీమ్‌లో పట్టించుకోకపోవడంపై టీమిండియా అభిమానులు, మాజీ క్రికెటర్లు  సెలక్టర్ల మీద గుర్రుగా ఉన్నారు. మణికట్టు మాయాజాలంతో   వికెట్లను రాబట్టే  చాహల్‌ను ఆడించాల్సిందని వాపోతున్నారు. అయితే చాహల్‌కు అవకాశం దక్కకపోయినా అతడి భార్య  ధనశ్రీ వర్మ మాత్రం ప్రపంచకప్ టీమ్‌లో భాగమైంది. తాజాగా  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)  విడుదల చేసిన   వరల్డ్ కప్ యాంథెమ్ ‌లో  చాహల్ సతీమణి భాగమైంది.  


వన్డే వరల్డ్ కప్ - 2023ను జనంలోకి తీసుకెళ్లేందుకు గాను వివిధ రూపాలలో ప్రచార  కార్యక్రమాలను చేస్తున్న  ఐసీసీ.. తాజాగా  యాంథెమ్ ను విడుదల చేసింది. బాలీవుడ్  స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఈ పాటలో  ధనశ్రీ వర్మ కూడా ఆడిపాడింది.  ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్  స్వరాలు సమకూర్చిన ఈ పాటను శ్లోక్ లాల్, సావేరి వర్మలు  రచించారు.  ‘దిల్ జషన్ బోలే’ అంటూ సాగే ఈ గీతాన్ని ప్రీతమ్‌తో పాటు నకాష్ అజిజ్, శ్రీరామచంద్ర, అమిత్ మిశ్రా, జోనితా గాంధీ,  అకాస, చరణ్‌లు ఆలపించారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ పాట నెట్టింట హల్చల్ చేస్తోంది. 






ఇక ధనశ్రీ వర్మ విషయానికొస్తే  ఆమె  యూట్యూబర్‌తో పాటు డాన్స్ టీచర్ కూడా.. ఆమె దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన యుజీ..  ఏకంగా ఆమెను ప్రేమలో దింపి  లవ్ డ్యూయెట్లు పాడుకుని  పెళ్లి  కూడా చేసుకున్నాడు.  డాన్స్‌లో దుమ్మురేపే  ధనశ్రీ.. ఎనర్జీకే ఎనర్జీ డ్రింక్ ఇచ్చేలా ఉండే రణ్‌వీర్ సింగ్ డాన్స్‌తో మ్యాచ్ చేస్తూ అలరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో  5.5 మిలియన్ల ఫాలోవర్లను కలిగిఉన్న ధనశ్రీ.. వరల్డ్ కప్ యాంథెమ్‌కు మరింత గ్లామర్‌ను తీసుకొచ్చింది. చాహల్ వరల్డ్ కప్‌లో భాగం కాకపోయినా కనీసం  ఆయన భార్య అయినా ప్రపంచకప్‌లో భాగమైందని  నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. 


 






ఇదిలాఉండగా  వరల్డ్ కప్ యాంథెమ్ అని చెప్పి హిందీలో మాత్రమే పాటను రిలీజ్ చేయడంపై ఇతర దేశాల  క్రికెట్ ఫ్యాన్స్   ఐసీసీ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హిందీలో పాట చేస్తే అది కేవలం భారత్, పాకిస్తాన్‌కే అర్థమవుతుందని మిగతా దేశాల  అభిమానుల సంగతేంటని  ఐసీసీ  పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నారు.