Asian Games 2023:
ఆసియా క్రీడల్లో ఓ విచిత్రం చోటు చేసుకుంది! మంగోలియా మహిళల క్రికెట్ జట్టు కేవలం 15 పరుగులకే ఔటైంది. ప్రత్యర్థి ఇండోనేసియా చేతిలో ఏకంగా 172 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం పాలైంది.
చైనాలోని హంగ్జౌలో ఆసియా క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం మహిళల టీ20 పోటీలు ఆరంభమయ్యాయి. మొదటి మ్యాచులో ఇండోనేసియా, మంగోలియా జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇండోనేసియా 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఓపెనర్లు ని పుటు ఆయు నందా సకారిణి (35; 31 బంతుల్లో 4x4, 1x6), ని లుహ్ దేవి (62; 48 బంతుల్లో 10x4, 0x6) అదరగొట్టారు. ఈ ఓపెనింగ్ జోడీ తొలి వికెట్‌కు 58 బంతుల్లోనే 106 పరుగుల భాగస్వామ్యం అందించింది. అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నంద సకారిణిని ఔట్ చేయడం ద్వారా అనుజిన్ విడదీసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ వేగం మందగించింది. జట్టు స్కోరు 140 వద్ద దేవిని నముంజుల్, 142 వద్ద ఆండ్రియాని (0)ని ఎన్‌కుజుల్ ఔట్ చేశారు. ఈ సిచ్యువేషన్లో మరియా కొరాజన్ (22), కిసి కాసి (18) జట్టును ఆదుకున్నారు. మరోవైపు 49 అదనపు పరుగులు రావడంతో ఇండోనేసియాకు భారీ స్కోర్ లభించింది.
భార లక్ష్య ఛేదనకు దిగిన మంగోలియాను ఇండోనేసియా బౌలర్లు వణించారు. ఆండ్రియాని (4/8), రెహ్మావతి (2/1), ని లుహ్ దేవి (2/4) విలవిల్లాడించారు. కనీసం ఒక్క బ్యాటర్‌నూ రెండంకెల స్కోర్ చేయనివ్వలేదు. బట్జర్‌గాల్ ఇచిన్‌కోర్లూ (5; 19 బంతుల్లో) టాప్ స్కోరర్ అంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆమెతో పాటు మరో ఓపెనర్ బ్యాట్ అమాగలన్ 16 బంతులు ఆడినా పరుగులేమీ చేయకుండానే నిష్క్రమించింది. మొత్తంగా మంగోలియాలో ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఇద్దరు ఒక పరుగుకే పరిమితం అయ్యారు. ఒకరు మూడు పరుగులు చేయగా.. అదనపు పరుగుల రూపంలో ఐదు వచ్చాయి.
ఆసియా క్రీడల్లో భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. సెప్టెంబర్ 21న తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ప్రత్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. మంగళ, బుధవారాల్లో జరిగే మ్యాచుల విజేతలు ఇందుకు అర్హత సాధిస్తారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక సైతం నేరుగా క్వార్టర్‌కు చేరుకున్నాయి. సెప్టెంబర్ 24న సెమీ ఫైనళ్లు, 25న ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. టీమ్‌ఇండియా ఫైనల్ చేరడం గ్యారంటీ! కనీసం ఇప్పటికే రజతం ఖాయమైనట్టు భావించొచ్చు.