ODI World Cup 2023: వచ్చేనెల 5 నుంచి  భారత్ వేదికగా జరుగబోయే  వన్డే వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించేందుకు గాను  సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ‘గోల్డెన్ టికెట్’ను అందింది.  బీసీసీఐ కార్యదర్శి రజినీకాంత్.. స్వయంగా చెన్నైలోని రజినీ ఇంటికి వెళ్లి మరీ  ఈ గోల్డెన్ టికెట్‌ను  జైలర్ హీరోకు అందజేశాడు.  


వరల్డ్ కప్‌ను జనంలోకి తీసుకెళ్లి ఈ మెగా ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు గాను  బీసీసీఐ, ఐసీసీలు వినూత్న రీతిలో  కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే   జై షా.. ఇదివరకే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, టీమిండియా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కూ ఈ  గోల్డెన్ టికెట్లను అందజేశాడు. తాజాగా  జై షా.. రజినీకీ ఈ టికెట్‌ను అందజేశాడు.  


ఈ గోల్డెన్ టికెట్ అందిన   సెలబ్రిటీ వరల్డ్ కప్ మ్యాచ్‌లను పూర్తిగా ఉచితంగా వీఐపీ లాంజ్‌లో కూర్చుని చూసే వీలు దక్కుతుంది. రజినీకి గోల్డెన్ టికెట్ ఇచ్చిన తర్వాత  బీసీసీఐ, జై షాలు ఈ విషయాన్ని తమ  ట్విటర్ ఖాతాల వేదికగా అభిమానులతో పంచుకున్నాయి.    క్రికెట్ అభిమాని అయిన తలైవాకు వన్డే వరల్డ్ కప్ చూసేందుకు స్వాగతమని జై షా ట్వీట్‌లో పేర్కొన్నాడు.  






కాగా సెలబ్రిటీలకు  గోల్డోన్ టికెట్లు ఇవ్వడంపై  క్రికెట్ అభిమానులలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  తాము టికెట్ల కోసం బుకింగ్ యాప్స్‌లో పడిగాపులు కాస్తుంటే  తమ బాధలు పట్టించుకోని బీసీసీఐ, ఐసీసీ.. సెలబ్రిటీలకు ఇలా టికెట్లను పంచిపెట్టడమేంటని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే  సినీ ప్రముఖులకే కాకుండా భారత్‌కు వన్డే ప్రపంచకప్‌లు అందించిన కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీకి ఒలింపిక్ ఛాంపియన్  నీరజ్ చోప్రా, ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్‌కూ  అందజేయాలని ఇటీవలే కోరారు. 






గవాస్కర్ స్పందిస్తూ.. ‘బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం (గోల్డెన్ టికెట్)  చాలా గొప్పది.  వివిధ రంగాలలో  ప్రముఖులుగా ఉన్న వారికి వీటిని అందించడం ద్వారా వారిని గౌరవించడం గొప్ప ఆలోచన. ఇప్పటివరకైతే అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్‌లకు గోల్డెన్ టికెట్స్ ఇచ్చారు.  అలాగే  టీమిండియాకు వన్డే  ప్రపంచకప్‌లను అందించిన  కపిల్ దేవ్, ధోనీలకూ వీటిని అందించాలి. అంతేగాక  ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, ఇస్రో చీఫ్   ఎస్.సోమనాథ్‌కూ అందజేయాలి.  వాళ్లు దానికి పూర్తిగా అర్హులు...


ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. కానీ ఇస్రో చీఫ్‌కు గోల్డెన్ టికెట్ అందజేయడం ఆయనకు  గౌరవం వంటిది.  ఆయన ఆధ్వర్యంలో భారత కీర్తి పతాక చందమామ దగ్గరికీ  చేరింది.  ఇక నీరజ్ చోప్రా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ గానే గాక ఇటీవలే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ అయ్యాడు..’అని అన్నాడు.