NZ WC 2023 Jersey: 


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు న్యూజిలాండ్‌ (New Zealand) సరికొత్తగా సిద్ధమవుతోంది. మెగా టోర్నీ కోసం కొత్త జెర్సీని రూపొందించింది. ఎప్పట్లాగే తన సంప్రదాయ నలుపు రంగులోనే జెర్సీని డిజైన్‌ చేసింది. పొట్ట భాగంలో న్యూజిలాండ్ అని రాసి ఉంది. ఛాతీ ఎడమవైపు కివీస్‌ చిహ్నమైన సిల్వర్‌ ఫెర్న్‌ ఆకును ఉంచింది. కుడివైపు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ లోగోను ముద్రించింది. ఇక భుజాల వద్ద స్పాన్సర్‌ బ్రాండ్‌ను ఉంచింది. టీషర్ట్‌ కిందవైపు నిలువు చారల డిజైన్‌ వాడింది.


అక్టోబర్‌ 5 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ (ICC ODI Worldcup 2023) మొదలవుతుంది. ఈ నేపథ్యంలో కివీస్‌ కొత్త జెర్సీని విడుదల చేసింది. పేసర్లు లాకీ ఫెర్గూసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, వికెట్ కీపర్‌ బ్యాటర్‌ టామ్‌ లేథమ్‌ కొత్త జెర్సీని ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. 'మన క్రికెట్ ప్రపంచ కప్‌ టీషర్ట్ అందుబాటులో ఉంది' అని క్రికెట్‌ న్యూజిలాండ్‌ 'ఎక్స్‌' వేదికగా పోస్టు చేసింది.


కేన్‌ విలియమ్సన్‌ టీ20, టెస్టు పగ్గాలు వదిలేశాక న్యూజిలాండ్‌ క్రికెట్‌ కాస్త బలహీనపడింది. పైగా సీనియర్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ టెస్టులు, టీ20లకు అందుబాటులో ఉండటం లేదు. ఎక్కువగా ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడుతున్నాడు. దాంతో జట్టులో సమన్వయం కుదరడం లేదు. ఈ మధ్యే సొంత దేశంలో ఇంగ్లాండ్‌తో నాలుగు వన్డేల సిరీసును 1-3తో ఓటమి పాలైంది. మరికొన్ని రోజుల్లోనే కివీస్‌ బంగ్లాదేశ్‌కు రానుంది. అక్టోబర్‌ 21 నుంచి మూడు వన్డేల సిరీసులో తలపడనుంది. యువకులతో కూడిన టీమ్‌ను లాకీ ఫెర్గూసన్‌ నడిపించనున్నాడు.


గాయాలతో దూరమైన మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పునరాగమనం చేస్తుండటం కివీస్‌కు శుభసూచకం. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అతడి అనుభవం జట్టుకు ఉపయోగకరం. పైగా భారత్‌ పిచ్‌లు, ఇక్కడి వాతావరణంపై అతడికి అవగాహన ఉంది. అతడితో పాటు టిమ్‌ సౌథీ నాలుగోసారి వన్డే ప్రపంచకప్‌ ఆడనున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుపులు మెరిపిస్తున్న మార్క్‌ చాప్‌మన్‌ జట్టులోకి వచ్చాడు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్రకూ చోటు దక్కింది. ఇంగ్లాండ్‌తో మొదటి వన్డేలో అతడు 3/48తో అదరగొట్టాడు.


యంగ్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ ఫిన్‌ అలెన్‌, బ్యాకప్‌ వికెట్ కీపర్‌ టిమ్‌ సీఫెర్ట్‌కు జట్టులో చోటివ్వలేదు. కివీస్‌ కేవలం టామ్‌ లేథమ్‌నే కీపర్‌గా ఎంచుకుంది. ఈ మధ్యే గాయపడిన పేసర్‌ ఆడమ్‌ మిల్న్‌ టోర్నీకి దూరమవుతున్నాడు.


న్యూజిలాండ్‌ జట్టు: కేన్ విలియమ్సన్  (కెప్టెన్), ట్రెంట్ బౌల్డ్, మార్క్ చాప్‌మన్, డేవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాథ్యూ హెన్రీ, టామ్ లేథమ్ (వికెట్ కీపర్),  డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి,  టిమ్ సౌథీ, విల్ యంగ్


ఉప్పల్‌ స్టేడియంలో సెప్టెంబర్‌ 29న పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ సన్నాహక మ్యాచ్‌ ఆడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు పోరు మొదలవుతుంది. అరగంట ముందే టాస్‌ వేస్తారు. పెద్ద జట్లే కావడంతో ఆటగాళ్లు, మ్యాచును వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా. అయితే ఈ మ్యాచుకు భద్రత కల్పించలేమని రాచకొండ పోలీసులు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘానికి సమాచారం ఇచ్చారని తెలిసింది.