Pujara Suspended: టీమిండియా టెస్టు క్రికెటర్, అభిమానులంతా ‘నయా వాల్’ అని పిలుచుకునే ఛటేశ్వర్ పుజారా తాను చేయని తప్పునకు బలయ్యాడు. తన జట్టులోని ఆటగాళ్ల ప్రవర్తనకు అతడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ - 2లో ఆడుతున్న పుజారా ససెక్స్ జట్టకు సారథిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో ససెక్స్ ఆటగాళ్ల ప్రవర్తన నిబంధనలను అతిక్రమించడంతో జట్టులో ముగ్గురు ప్లేయర్లతో పాటు పుజారా కూడా ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ విషయాన్ని వెల్లడించింది.
పుజారా సారథిగా ఉన్న ససెక్స్ జట్టు ఈ సీజన్లో నాలుగు ఫిక్స్‌డ్ పెనాల్టీలను ఎదుర్కుంది. ఇవి 12 పాయింట్లతో సమానం. ఒక సీజన్‌లో ఓ జట్టు నాలుగు ఫిక్స్‌డ్ పెనాల్టీలను ఎదుర్కుంటే ఆ జట్టు కెప్టెన్‌కు ఒక మ్యాచ్ నిషేధంతో పాటు ఆటగాళ్లపైనా చర్యలుంటాయి. కౌంటీ ఛాంపియన్‌షిప్ తొలి అంచెలోనే రెండు ఫిక్స్‌డ్ పెనాల్టీలను ఎదుర్కున్న పూజారా జట్టు.. ఈనెల 13న లీస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో రెండు పెనాల్టీలను మూటగట్టుకుంది.
లీస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ ఆటగాళ్లు టామ్ హెయిన్స్, జాక్ కార్సన్, అరి కార్వెలాస్‌లు మైదానంలో నిబంధనలను విరుద్ధంగా ప్రవర్తించారు. పదే పదే అప్పీల్స్ చేస్తూ అంపైర్లకు విసుగు తెప్పించారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కూడా ఈ ముగ్గురి ప్రవర్తన శృతిమించింది. అప్పటికే పలుమార్లు చెప్పిచూసిన అంపైర్లు ససెక్స్ ఆటగాళ్లలో మార్పు రాకపోవడంతో పెనాల్టీ పాయింట్లు విధించారు. దీంతో ఈ ముగ్గురితో పాటు కెప్టెన్ పుజారా కూడా నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్ 262 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లీస్టర్‌షైర్ 108 పరుగులకు చాపచుట్టేసింది. భారత బౌలర్ జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ససెక్స్.. 344 పరుగుల భారీ స్కోరు చేసింది. 499 పరుగుల లక్ష్య ఛేదనలో లీస్టర్‌షైర్ 483 పరుగులకు ఆలౌట్ అయింది. 15 పరుగుల తేడాతో ససెక్స్ విజయాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఉనద్కత్ ఆరు వికెట్లతో చెలరేగాడు.
ఈ టోర్నీలో ససెక్స్ తమ తదుపరి మ్యాచ్‌ను డెర్బీషైర్‌తో నేటి నుంచి ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో పుజారాతో పాటు నిషేధం ఎదుర్కున్న మిగతా ముగ్గురూ దూరమయ్యారు. దీంతో ఓలీవర్ కార్టర్ ససెక్స్‌ను నడిపిస్తున్నాడు.