Yuzvendra Chahal: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దిగ్గజ బౌలర్లను అధిగమించి టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా చహల్.. టీ20లలో 300 వికెట్లతో పాటు ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన లసిత్ మలింగ రికార్డులను కూడా సమం చేశాడు. టీ20లలో భారత్ స్టార్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, అశ్విన్ వంటి దిగ్గజ బౌలర్లు కూడా చహల్ తర్వాతే ఉన్నారు.
ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ముగిసిన మ్యాచ్‌లో చహల్.. నాలుగు వికెట్లు తీశాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు పొదుపుగా బౌలింగ్ చేసి 17 పరుగులే ఇచ్చాడు. గత సీజన్ లో చహల్.. 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అదే ఊపును కొనసాగిస్తూ సన్ రైజర్స్ కు షాకుల మీద షాకులిచ్చాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయడంతో చహల్.. టీ20లలో 300 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
బ్రావో ఫస్ట్.. చహల్ 15..
ఫ్రాంచైజీ క్రికెట్ జోరు కొనసాగుతున్న వేళ దేశానికో లీగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇలా పలు లీగ్ లతో పాటు దేశానికి ఆడుతూ అత్యధిక వికెట్లు తీసిన వారిలో వెస్టిండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో అగ్రస్థానంలో నిలిచాడు. బ్రావో.. 558 మ్యాచ్ లలో 615 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో బ్రావో తర్వాత అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (530), కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ (479), ఇమ్రాన్ తాహిర్ (469), షకిబ్ అల్ హసన్ (451) టాప్ - 5 లొ ఉన్నారు. చహల్.. మొత్తంగా 265 మ్యాచ్ లలో 303 వికెట్లు పడగొట్టి 15వ స్థానంలో నిలిచాడు.
భారత్ నుంచి ఒకే ఒక్కడు..
భారత్ తరఫున ఈ ఫార్మాట్ లో 300 వికెట్లు తీసిన తొలి బౌలర్ చహలే. చహల్ తర్వాత అశ్విన్ (287), పీయూశ్ చావ్లా (276), అమిత్ మిశ్రా (276), బుమ్రా (356) లు ఉన్నారు.
మలింగ రికార్డు సమం..
సన్ రైజర్స్ తో మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా చహల్.. ఐపీఎల్ లో అతడి వికెట్ల సంఖ్య 170కి చేరింది. తద్వారా ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అగ్రస్థానంలో ఉన్న భారత బౌలర్ అమిత్ మిశ్రా (166) ను అధిగమించిన చహల్.. లసిత్ మలింగ 170 వికెట్ల రికార్డునూ సమం చేశాడు. మలింగ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ 122 మ్యాచ్ లలో 170 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బౌలర్ కూడా డ్వేన్ బ్రావోనే కావడం గమనార్హం. బ్రావో.. 161 మ్యాచ్ లలో 183 వికెట్లు తీశాడు. ఈ సీజన్ లో రాజస్తాన్ లీగ్ దశలోనే మరో 13 మ్యాచ్ లు ఆడనున్న నేపథ్యంలో బ్రావో రికార్డును చెరిపేయడం చహల్‌కు పెద్ద కష్టమేమీ కాదు.