కొత్త సంవత్సరం రాబోతుంది. మరో క్రీడా సంవత్సరం కాల గర్భంలో కలిసిపోతోంది. ఈ ఏడాది క్రీడల్లో ఎన్నో అద్భుతాలు.. మరెన్నో మధుర విజయాలు. కొన్ని విజయాలు అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. కొన్ని పరాజయాలు అభిమానులను కంటతడి పెట్టించాయి. పొట్టి క్రికెట్‌లో చాలామంది క్రికెటర్లు ఈ ఏడాది తమ మార్కు ఆటతీరుతో అబ్బురపరిచారు. భారత క్రికెట్‌లో 2023 సంవత్సరంలో అయిదు మధుర జ్ఞాపకాలను ఓసారి నెమరు వేసుకుందాం.


మధుర జ్ఞాపకాలు
1‌) ఈ ఏడాదిలో మూడు ఫార్మట్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా మట్టికరిపించింది, టెస్ట్, వన్డే, T20 మూడు ఫార్మాట్‌లలో ఆస్ట్రేలియాను ఓడించింది. 4-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో తన స్థానాన్ని దక్కించుకుంది. దీంతో పాటు వన్డే, టీ20 సిరీస్‌లలో కూడా ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది టీమిండియా. ఆస్ట్రేలియాతో జరిగిన 5-మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భారత్‌కు కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించాడు. ఈ సిరీస్‌ను టీం ఇండియా 4-1తో సిరీస్‌ను గెలుచుకుంది. 


2‌) మూడు ఫార్మాట్లలో టీమిండియా ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలిచి ఔరా అనిపించింది. టెస్ట్, వన్డే, T20ల్లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఈ ఏడాది కూడా మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమ్ ఇండియా.. ప్రపంచ నంబర్-1 జట్టుగా అవతరించింది. అన్ని ఫార్మట్లలో అప్రతిహాత విజయాలతో టీమిండియా ఈ ఏడాది క్రికెట్‌పై చెరగని ముద్ర వేసింది.


3‌) వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఆసియా ఛాంపియన్‌షిప్‌ సవాల్‌ ఎదురైంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికగా జరిగిన వన్డే ఆసియా కప్ 2023లో భారత్ మొదటి నుంచి చివరి వరకు అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్, ఆ తర్వాత చివరి మ్యాచ్‌లో శ్రీలంకను కేవలం 50 పరుగులకే ఆలౌట్ చేసి ఆధిపత్య ప్రదర్శనతో ఆసియా కప్‌ను గెలుచుకుంది. 


4‌) భారత క్రికెట్‌ జట్టుతో పాటు విరాట్‌ కోహ్లీకి కూడా ఈ ఏడాది చిరస్మరణీయంగా నిలిచింది. విరాట్ కోహ్లి ఈ సంవత్సరం అన్ని ఫార్మట్‌లలో భారీగా పరుగులు చేశాడు. ప్రపంచకప్‌ విరాట్‌ బ్యాటింగ్‌ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. వన్డే ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్  49 సెంచరీల రికార్డును విరాట్‌ బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్‌పై తన కెరీర్‌లో 50వ వన్డే సెంచరీని సాధించి చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలో విరాట్‌ 50వ శతకం అత్యుత్తమ క్షణాలలో ఒకటి. 


5) భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచ కప్ 2023లో టీమ్ ఇండియా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. తుది మెట్టుపై బోల్తాపడినా రోహిత్‌ సేన ఆటతీరు అభిమాలను కట్టిపడేసింది. ఆస్ట్రేలియాపై విజయంతో ప్రపంచకప్‌ను ప్రారంభించిన టీమిండియా, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈ మెగాటోర్నీలో అన్ని జట్లను ఓడించింది. లీగ్ దశలో దాదాపు 9 మ్యాచ్‌లను ఏకపక్షంగా గెలిచి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను కూడా ఓడించి వరల్డ్ ఫైనల్‌కు చేరుకుంది.