జొహెన్నస్‌బర్గ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో అతిథ్య దక్షిణాఫ్రికాపై భారత్ జట్టు ఘన విజయం సాధించి సిరీల్‌లో శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్‌  తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో సాయి.. 43 బంతుల్లోనే 9 బౌండరీల సాయంతో 55 పరగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేయడం ద్వారా అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ చేసిన నాలుగో భారత ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు.  


ఈ మ్యాచ్‌ తర్వాత టీమిండియా స్టార్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎక్స్‌ వేదికగా ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఈ మ్యాచ్‌ ద్వారా సాయి సుదర్శన్‌ రూపంలో భారత్‌కు భవిష్యత్‌ స్టార్‌ దొరికాడని, టీమిండియాకు అతడే ‘నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌’ అంటూ ప్రశంసలు కురిపించాడు. నమ్మకం కుదరకుంటే తన వ్యాఖ్యలను రాసిపెట్టుకోమని కూడా స్టేట్‌ మెంట్‌ ఇచ్చాడు. రాసిపెట్టుకోండి. ఈ కుర్రాడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడని సాయి సుదర్శన్‌ను అశ్విన్‌ పొగడ్తలతో ముంచేశాడు. 2021లో తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో అరంగేట్రం చేసినప్పట్నుంచీ ఇప్పటివరకూ అతడు వెనుదిరిగి చూసుకోలేదని గుర్తు చేశాడు. వన్డే అరంగేట్ర మ్యాచ్‌లోనే తానెంటో నిరూపించుకున్న సాయిసుదర్శన్‌ భవిష్యత్‌ స్టార్‌ అంటూ పొగిడేశాడు. అశ్విన్‌తో పాటు సాయి కూడా తమిళనాడుకు చెందినవారే.



 ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు భారత్ పేసర్ల ధాటికి  విలవిల్లాడింది. యువపేసర్లు అర్ష్‌దీప్‌సింగ్‌, ఆవేశ్‌ఖాన్‌ నిప్పులు చెరగడంతో 27.3 ఓవర్లో 116 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఫెలుక్వాయో ఒక్కడే 33 పరుగులతో  ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్‌ టోనీ డి జోర్జి 28 పరుగులు చేశాడు. తొలి ఓవర్‌ నుంచే భారత్‌  పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.అయిదు వికెట్లు తీసి అర్ష్‌దీప్‌ ప్రోటీస్‌ పతనాన్ని శాసించాడు. ఆవేశ్‌ఖాన్‌ కూడా నాలుగు వికెట్లతో రాణించాడు. ప్రొటీస్‌ జట్టులో ఏడుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే అవుటయ్యారు. సొంతగడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ కేవలం 16.4 ఓవర్లో రెండు వికెట్ల కోల్పోయి విజయాన్ని అందుకుంది. 



 మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అయిదు వికెట్లతో సత్తా  చాటిన  టీమిండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. ద‌క్షిణాప్రికా గ‌డ్డ పై ఐదు వికెట్లు తీసిన మొద‌టి భార‌త పేస‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 ఓవ‌ర్లు వేసిన అర్ష్‌దీప్ సింగ్ 37 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అర్ష్‌దీప్ కంటే ముందు ఐదు వికెట్ల ప్రద‌ర్శన చేసిన వారంతా స్పిన్నర్లే . మొట్టమొద‌టి సారి ద‌క్షిణాఫ్రికా గ‌డ్డపై తొలిసారి 1999లో స్పిన్నర్ సునీల్ జోషి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు.  ఆ త‌రువాత 2018లో సెంచూరియన్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచులో స్పిన్నర్ 22 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు నేలకూల్చాడు. తాజాగా అర్ష్‌దీప్ సింగ్ మొద‌టి పేస‌ర్‌గా నిలిచాడు. అయితే మ్యాచ్‌ ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనైన‌ట్లు అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. ఈ మ్యాచ్ కంటే ముందు అర్ష్‌దీప్ మూడు వ‌న్డేలు ఆడిన‌ప్పటికీ ఒక్క వికెట్ కూడా ప‌డ‌గొట్ట‌లదు. ఇదే విష‌యాన్ని అత‌డు చెప్పాడు. అయితే.. నాలుగో మ్యాచులో ఏకంగా ఐదు వికెట్లతో రాణించ‌డం ఆనందాన్ని ఇచ్చింద‌న్నాడు.