Year Ender 2022:  2022వ సంవత్సరం ప్రపంచ క్రికెట్ లో కొన్ని విషాదాల్ని నింపింది. కొంతమంది ప్రముఖ క్రికెటర్లు ఈ ఏడాది మరణించారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్ ల అకాల మరణం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చావు అంచులదాకా వెళ్లివచ్చాడు. 


కారు ప్రమాదంలో కన్నుమూసిన సైమండ్స్


ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మార్చి 2022లో కారు ప్రమాదంలో మరణించాడు. టౌన్స్ విల్లే సమీపంలో సైమండ్స్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో కేవలం 46 ఏళ్ల వయసులో ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడు కన్నుమూశాడు. ఆస్ట్రేలియా బెస్ట్ ఆల్ రౌండర్ల లిస్టులో సైమండ్స్ పేరు కచ్చితంగా ఉంటుంది. భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, ఆండ్రూ సైమండ్స్ మధ్య మంకీ గేట్ వివాదం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. 


స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాత్మరణం


క్రికెట్ చరిత్రలోనే షేన్ వార్న్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. స్పిన్ బౌలింగ్ లో అతడి తర్వాతే ఎవరైనా అనేంతలా ప్రపంచ క్రికెట్ లో పేరు తెచ్చుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన తొలి ఆస్ట్రేలియా బౌలర్ గా, ప్రపంచంలోనే రెండో బౌలర్ గా పేరు గడించాడు. ఈ ఏడాది మార్చిలో వార్న్ తన స్నేహితులతో కలిసి థాయ్ లాండ్ కు విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ కోస్యామ్యూయ్ లోని ఓ హోటల్ లోని రూమ్ లో హఠాత్తుగా మరణించాడు. టెస్ట్ క్రికెట్ లో వార్న్ మొత్తం 708 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వెయ్యికిపైగా వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు. 


పెను ప్రమాదాన్ని తప్పించుకున్న రిషభ్ పంత్


డిసెంబర్ 30 టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. అతను దిల్లీ నుంచి తన సొంత ఊరు వెళుతుండగా రూర్కీ వద్ద అతను ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు దహనమైంది. అయితే కారులో నుంచి దూకేసిన పంత్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అతని నుదురు, వీపు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈ వికెట్ కీపర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యుల తెలిపారు.