Rishabh Pant Career:  టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడనుందా! అతను ఆటలో ఇంకా ఎక్కవకాలం కొనసాగలేడా! ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు అవును అని గట్టిగా సమాధానం లేకపోయినా.. భవిష్యత్తులో మాత్రం అదే ఆన్సర్ వచ్చేలా ఉంది. ఎందుకంటే....


ఉత్తరాఖండ్ లోని రూర్కీ వద్ద నిన్న(శుక్రవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆటగాడు రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. రిషభ్‌ పంత్‌ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. కారు పూర్తిగా దగ్ధమైంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆయన్ని కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఈ ప్రమాదం నుంచి పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతని నుదురు, వీపు, కుడికాలు వద్ద గాయాలయ్యాయి. ఈ ప్రమాదమే పంత్ కెరీర్ ను ప్రశ్నార్థకం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. 


గాయాలివి


ప్రమాదంలో గాయపడిన పంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతని నుదురు చిట్లడం, వీపుపైన కాలిన గాయాలు త్వరగానే నయమవుతాయి. కానీ ప్రధానంగా కుడి మోకాలి లిగ్మెంట్ స్థానభ్రంశం చెందడం మాత్రం ప్రమాదకరంగా మారింది. ఇలాంటి గాయాలు ఆటగాళ్ల కెరీర్ కు మంచిదికాదు. వాస్తవానికి లిగ్మెంట్ మోకాలిని గట్టిగా పట్టుకుని, కదలికల సమయంలో మద్దతు ఇస్తుంది. స్నాయువు దెబ్బతింటే మోకాలి కీలు పట్టు కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిలబడడం, నడవడం కూడా ఇబ్బందే అవుతుంది. మాములు చికిత్సతో ఇది నయం అయితే సరే. లేకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా కోలుకునేందుకు చాలా సమయం పట్టవచ్చు. ప్రస్తుతం రిషభ్ పంత్ భారత జట్టుకు ప్రధాన కీపర్ గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ గాయాల నుంచి కోలుకుని అతను మాములుగా ఆడడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. 


డాక్టర్లు ఏమంటున్నారంటే


ప్రస్తుతం తనకు తగిలిన గాయాల నుంచి పంత్ కోలుకునేందుకు కనీసం 2 నుంచి 6 నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఒకవేళ కాలుకి సర్జరీ అవసరమైతే పూర్తిగా కోలుకునేందుకు మరింత టైం పడుతుందని అంటున్నారు. 


ఈ ప్రమాదంతో వచ్చే ఐపీఎల్ కు పంత్ దాదాపు దూరమైనట్లే. రిషభ్ ఐపీఎల్ లో దిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరి అతని స్థానంలో ఆ జట్టు పగ్గాలు ఎవరికి అందుతాయో చూడాలి.