WTC Final 2023: 


టీమ్‌ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ చిక్కుల్లో పడ్డాడు! అంపైర్‌ లేదా మ్యాచ్‌ రిఫరీ ఆగ్రహానికి గురవ్వొచ్చు. ఐసీసీ అతడిని సస్పెండ్‌ చేయొచ్చు. లేదా అతడిపై జరిమానా విధించే అవకాశమూ లేకపోలేదు. అంపైర్‌ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా గిల్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టడమే ఇందుకు కారణం.


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) మోస్తరు ప్రదర్శనే చేశాడు. అయితే నాలుగో రోజు అతడు వివాదాస్పదంగా ఔటయ్యాడు. అతడిచ్చిన క్యాచును కామెరాన్‌ గ్రీన్‌ డైవ్‌ చేసి అందుకున్నాడు. రిప్లేలో బంతి నేలకు తాకినట్టు కనిపిస్తోంది. కొన్ని వీడియోల్లో బంతి కింద రెండు వేళ్లు ఉన్నట్టు కనిపించింది. క్యాచ్‌పై సందేహాలు ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్‌ మాత్రం ఔటిచ్చాడు. ఇది కాంట్రవర్సీగా మారింది.






డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. కామెరాన్‌ గ్రీన్‌ చేతిలోని బంతి నేలను తాకుతున్నట్టుగా కనిపించే చిత్రాన్ని జత చేశాడు. రెండు భూతద్దాలు తలను చేత్తో కొట్టుకుంటున్న ఎమోజీలను పెట్టాడు. సాధారణంగా ఆటగాళ్లు అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపట్టకూడదు. సోషల్‌ మీడియాలోనూ ఎత్తి చూపకూడదు. ఐసీసీ నిబంధనల్లోని 2.7 క్లాజ్‌ ప్రకారం ఆటగాళ్లు, సపోర్ట్‌ స్టాప్‌ పరిధి దాటి పోస్టులు పెట్టకూడదు. అయితే గిల్‌ పోస్టు తన అదృష్టాన్ని తిట్టుకుంటున్నట్టుగా ఉంది.


శుభ్‌మన్‌ గిల్‌ పోస్టు గురించి చెప్పి క్యాచ్‌ను బాగానే అందుకున్నారా అని ప్రశ్నించగా 'నేనైతే క్యాచ్‌ను సరిగ్గా పట్టినట్టే అనుకుంటున్నాను. ఏదేమైనా ఆ నిర్ణయాన్ని మూడో అంపైర్‌కు వదిలేశాను. ఆయన అంగీకరించారు' అని కామెరాన్‌ గ్రీన్‌ అన్నాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం గిల్‌ క్యాచ్‌ గురించి మీడియాతో మాట్లాడాడు.


Also Read: కెప్టెన్‌గా తొలి ఫైనల్ ఓడిన రోహిత్ - ఆ విజయపరంపరకు బ్రేక్


'మూడో అంపైర్‌ మూడు నాలుగు సార్లు ఆ క్యాచ్‌ను చూశాను. ఔటనే భావించారు. అయితే నిర్ణయాన్ని చాలా వేగంగా తీసుకున్నారు. ఇలాంటి కష్టమైన క్యాచుల్ని తీసుకున్నప్పుడు వంద శాతం కన్నా ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఎందుకంటే ఇది ఫైనల్‌. మ్యాచులో మేం చాలా కీలక దశలో ఉన్నాం. రిప్లేలో కేవలం రెండు కెమేరా యాంగిల్స్‌ మాత్రమే చూపించారు. మేం ఐపీఎల్‌లో 10 యాంగిల్స్‌ చూపిస్తున్నాం. ఇలాంటి ప్రపంచ టోర్నీల్లో అల్ట్రామోషన్‌ వంటివి ఎందుకు లేవో మాకైతే తెలియదు. కనీసం జూమ్‌ చేసిన చిత్రాలైనా లేవు' అని రోహిత్‌ తెలిపాడు.


ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గదను సొంతం చేసుకొనేందుకు 444 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా అందులో కనీసం ముప్పావు స్కోరైనా చేయలేదు. రెండో ఇన్నింగ్సులో 63.3 ఓవర్లు ఆడి 234 పరుగులకే ఆలౌటైంది. ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. విరాట్‌ కోహ్లీ (49; 78 బంతుల్లో 7x4), అజింక్య రహానె (46; 108 బంతుల్లో 7x4), రోహిత్‌ శర్మ (43; 60 బంతుల్లో 7x4, 1x6) టాప్‌ స్కోరర్లు. చెతేశ్వర్‌ పుజారా (27; 47 బంతుల్లో 5x4), శ్రీకర్ భరత్‌ (23; 41 బంతుల్లో 2x4) ఏదో మోస్తరు స్కోర్లు చేశారు.