Rohit Sharma Record: విరాట్ కోహ్లీ 2021లో టీ20 ప్రపంచకప్ సారథ్య బాధ్యతలు  తప్పుకున్న తర్వాత  బీసీసీఐ ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది.  అదే ఏడాది డిసెంబర్‌లో  కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి వాటిని కూడా హిట్‌మ్యాన్‌కే కట్టబెట్టింది. ఈ సందర్భంగా  అప్పుడు బీసీసీఐ చీఫ్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘కెప్టెన్‌గా రోహిత్‌కు ఐపీఎల్‌లో ఘనమైన రికార్డు ఉంది. రాబోయే ఐదారేండ్లలో  ఏడాదికొక ఐసీసీ ట్రోఫీ ఉంది. ఇందులో ఏదో ఒక్కటైనా టీమిండియా నెగ్గుతుంది.  ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను విజయవంతంగా నడిపిన రోహిత్.. భారత్‌కు  కూడా ఐసీసీ ట్రోఫీలు అందిస్తాడు..’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు. 


కట్ చేస్తే.. రోహిత్ సారథ్య బాధ్యతలు చేపట్టి సుమారు రెండేండ్లు కావొస్తుంది. ఈ రెండేండ్లలో భారత్ ఒక ఆసియా కప్, ఒక టీ20 ప్రపంచకప్‌, ఒక  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడింది. ఇందులో  ఏది కూడా భారత్ నెగ్గలేదు. 


ఫైనల్‌లో ఓడిపోని రికార్డు :


రోహిత్‌కు ఐపీఎల్‌తో పాటు  టీమిండియాకు కూడా కీలక టోర్నీలలో  ఫైనల్‌లో జట్టును విజయవంతంగా నడిపిన రికార్డు ఉంది.  2013లో  రోహిత్.. ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టాడు.   అప్పట్నుంచి ముంబై.. ఫైనల్ చేరిన ఏ ఒక్కసారి కూడా  ఆ జట్టు ఓడిపోలేదు. అలాగే భారత్‌కు కోహ్లీ గైర్హాజరీలో 2018 ఆసియా కప్, 2018 నిదాహాస్ ట్రోఫీ లకు కూడా  రోహితే సారథి. ఒకసారి ఆ జాబితాను పరిశీలిస్తే.. 


2013 ఐపీఎల్ ఫైనల్
2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్
2015 ఐపీఎల్ ఫైనల్ 
2017 ఐపీఎల్ ఫైనల్ 
2018 ఆసియా కప్ ఫైనల్
2018 ఆసియా కప్ ఫైనల్
2019 ఐపీఎల్ ఫైనల్ 
2020 ఐపీఎల్ ఫైనల్‌లో రోహిత్  సారథిగా విజయాలు సాధించాడు. 


కానీ ఓవల్ వేదికగా నేడు ముగిసిన ఫైనల్‌లో భారత జట్టు దారుణంగా  ఓడటంతో  హిట్‌మ్యాన్  ఫైనల్ విజయాల పరంపరకు అడ్డుకట్ట పడింది. 


 






రోహిత్  సారథ్య పగ్గాలు తీసుకున్నాక పలు ద్వైపాక్షిక సిరీస్ లు నెగ్గిన భారత జట్టు  ప్రధాన టోర్నీలలో మాత్రం విఫలమైంది. 


2022 ఆసియా కప్ :  సూపర్ - 6 దశలోనే నిష్క్రమణ 
2022  ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి 
2023 ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ : ఆసీస్ చేతిలో ఘోర పరాభవం


ఈ ఏడాది  రోహిత్ తన సారథ్య  సమర్థతను నిరూపించుకోవడానికి మరో రెండు కీలక టోర్నీలు ఉన్నాయి.   సెప్టెంబర్‌లో భారత్ ఆసియా కప్  ఆడాల్సి ఉండగా.. అక్టోబర్ - నవంబర్‌లో స్వదేశంలోనే వన్డే వరల్డ్ కప్ ఆడనుంది.  మరి ఈ రెండింటిలో అయిన హిట్‌మ్యాన్ తన  కెప్టెన్సీ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ లో ఫలితం తేడా కొడితే  రోహిత్ కెప్టెన్సీకే కాదు టీమ్ లో ప్లేస్‌కు కూడా ఎసరు వచ్చే ప్రమాదం లేకపోలేదు..