WTC 2023 Final Prize Money IND vs AUS: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ టైటిల్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో భారత్‌పై 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియాకు రూ. కోట్లలో ప్రైజ్ మనీ వచ్చింది. ఓటమి పాలైనప్పటికీ భారత్‌కు భారీ మొత్తం లభించింది.


ఆస్ట్రేలియాకు రూ.13.2 కోట్లు
ఆస్ట్రేలియాకు ఈ విజయంతో దాదాపు రూ. 13.2 కోట్లు వచ్చాయి. అదే సమయంలో టీమ్ ఇండియా రూ.6.5 కోట్లు దక్కించకుంది. వీరితో పాటు టాప్ 9 జట్లకు కూడా మంచి మొత్తం దక్కింది. ఆదివారం లండన్‌లోని ఓవల్‌లో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2014 తర్వాత ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో భారత్‌కు ఇది నాలుగో ఓటమి.


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టు కోసం ICC 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. దీని ప్రకారం ఆస్ట్రేలియాకు దాదాపు రూ. 13.2 కోట్లు వచ్చాయి. అదే సమయంలో ఫైనల్‌లో ఓటమి చవి చూసిన టీమిండియా దాదాపు రూ.6.5 కోట్లు దక్కించుకుంది.


ఇవి కాకుండా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు రూ.3.72 కోట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ రూ. 2.89 కోట్లు దక్కించుకుంది. ఐదో నంబర్‌లో ఉన్న శ్రీలంకకు రూ. 1.65 కోట్లు లభించాయి.


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రైజ్ మనీ
ఆస్ట్రేలియా - రూ. 13.2 కోట్లు
భారత్ - రూ.6.5 కోట్లు
దక్షిణాఫ్రికా - రూ. 3.72 కోట్లు
ఇంగ్లండ్ - రూ.2.89 కోట్లు
శ్రీలంక - రూ.1.65 కోట్లు


అలాగే ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్‌పై ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో విజయం సాధించి గదను కూడా సొంతం చేసుకుంది. వరుసగా రెండో ఫైనల్లో కూడా భారత్‌కు నిరాశే ఎదురైంది. 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా, 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవి చూసింది. పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీల ఆకలి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఉన్న నాలుగు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది.


1987, 1999, 2003, 2007, 2015 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లను గెలుచుకుంది. 2006, 2009 సంవత్సరాల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2021లో అందని ద్రాక్షగా నిలిచిన టీ20 వరల్డ్ కప్‌ను కూడా దక్కించుకుంది. ఇప్పుడు 2023లో భారత్‌పై గెలిచి ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ విజేతగా కూడా నిలిచింది.


ఇక భారత్ విషయానికి వస్తే... 1983, 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 2007లో టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. 2002లో శ్రీలంకతో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీని పంచుకుంది. కానీ 2013లో విజేతగా నిలిచింది. 2010, 2011, 2017, 2018, 2019 సంవత్సరాల్లో టెస్టు ఛాంపియన్ షిప్ గదను గెలుచుకుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో విజయం సాధిస్తే అన్ని ట్రోఫీలూ గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచేది.