డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ప్లాట్‌ఫాం యూజర్లకు ఆసియా కప్, పురుషుల వరల్డ్ కప్ టోర్నమెంట్‌లను ఉచితంగా స్ట్రీమ్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జియో సినిమా యాప్ ద్వారా ఐపీఎల్ 2023ని తన యూజర్లందరికీ జియో ఉచితంగా స్ట్రీమ్ చేసింది. ఇది హాట్‌స్టార్‌ను గట్టి దెబ్బ కొట్టింది. అందుకే డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.


కానీ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లలో స్ట్రీమ్ చేయాలంటే మాత్రం నగదు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనదేశంలో మొబైల్ ద్వారా కంటెంట్‌ను చూసేవారు ఎక్కువ కాబట్టి డిస్నీప్లస్ హాట్‌స్టార్ యాడ్ రెవిన్యూ ద్వారా ఈ మొత్తాన్ని కవర్ చేసుకునే అవకాశం ఉంది.


గతంలో క్రికెట్ ఈవెంట్ల ద్వారా డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఎంతో వ్యూయర్ షిప్‌ను సంపాదించుకుంది. ఆసియా కప్ 2022, పురుషుల టీ20 వరల్డ్ కప్ 2022, మహిళ టీ20 వరల్డ్ కప్ 2022 ద్వారా డిస్నీప్లస్ హాట్‌స్టార్ వ్యూయర్ షిప్ ఆకాశాన్ని తాకింది.


ప్రస్తుతం మనదేశంలో 54 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. వీరు తమ మొబైల్స్‌లో డిస్నీప్లస్ హాట్‌స్టార్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు ఉచితంగా ఆసియా కప్ 2023, 2023 వన్డే వరల్డ్ కప్‌లను స్ట్రీమ్ చేయవచ్చు. దీనికి వారు ఎటువంటి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంది.


టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇటీవలే తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లతో రీచార్జ్ చేసుకున్న యూజర్లకు కంపెనీ అదనపు డేటాను కూడా అందిస్తోంది. రూ. 999 ప్లాన్‌ ద్వారా వినియోగదారులకు 40 జీబీ అదనపు డేటాను ఉచితంగా అందజేస్తున్నారు.


జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త క్రికెట్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఇందులో ప్రతిరోజూ 3 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. కంపెనీ రూ. 999, రూ. 399, రూ. 219 యొక్క 3 ప్లాన్‌లను ప్రారంభించింది. రూ. 999 ప్లాన్‌లో కస్టమర్‌లు 84 రోజుల పాటు ప్రతిరోజూ 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో కంపెనీ రూ. 241 డేటా వోచర్‌ను కూడా ఉచితంగా ఇస్తోంది. దీని కింద కస్టమర్లు అదనంగా 40 జీబీ డేటాను ఉచితంగా పొందుతారు.


జియో రూ. 399, రూ. 219 ప్లాన్‌లలో కూడా కస్టమర్‌లు ప్రతిరోజూ 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. అయితే రెండు ప్లాన్‌ల వ్యాలిడిటీ వేర్వేరుగా ఉంటుంది. రూ. 399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో మీరు కంపెనీ నుంచి ఉచితంగా రూ. 61 డేటా వోచర్‌ను పొందుతారు. దీని కింద మీకు 6 జీబీ డేటా అందించనున్నారు. అదే సమయంలో రూ. 219 ప్లాన్‌లో కంపెనీ 2 జీబీ అదనపు డేటాను ఇస్తుంది. దీని వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది.


డేటా యాడ్ ఆన్ ప్లాన్ కూడా
ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం జియో మూడు డేటా యాడ్ ఆన్ ప్లాన్‌లను కూడా ప్రారంభించింది. Jio రూ. 222 ప్లాన్‌లో వినియోగదారులు 50 జీబీ డేటాను పొందుతారు. దీని వ్యాలిడిటీ ప్రస్తుతం మీరు ఉపయగిస్తున్న ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది.


Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?