Kohli Run Scoring:


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో విరాట్‌ కోహ్లీ పరుగులు చేయడం కష్టమేనని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అంటున్నాడు. అతడి బ్యాటింగ్‌లో ఒక లోపం కనిపిస్తోందని పేర్కొన్నాడు. ప్రతి బంతినీ క్రీజు దాటి ఆడుతున్నాడని వెల్లడించాడు. బ్యాక్‌ఫుట్‌లో ఆడితే స్కోరు వస్తుందని సూచించాడు.


కొన్ని రోజులుగా విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ టెక్నిక్‌లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నుంచీ అతడు ప్రతి బంతినీ ఫ్రంట్‌ఫుట్‌లోనే ఎదుర్కొంటున్నాడు. లిమిటెడ్‌ ఓవర్ల క్రికెట్లో ఇది పనిచేసినా సుదీర్ఘ ఫార్మాట్లో ఇబ్బందులు తప్పవు. ఈ మ్యాచుల్లో ఫీల్డింగ్‌ సెటప్‌, బౌలింగ్‌ తీరు భిన్నంగా ఉంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి ఇన్నింగ్సులో అతడు 31 బంతుల్లో 14 పరుగులు చేశాడు. మిచెల్‌ స్టార్క్‌ వేసిన బౌన్సింగ్‌ షార్ట్‌ బాల్‌ను క్రీజు ముందుకొచ్చి ఆడాడు. ఎడ్జ్‌ అయిన బంతి స్లిప్‌లో స్టీవ్‌ స్మిత్‌కి చిక్కింది. అందుకే అతడు బ్యాక్‌ఫుట్‌లో ఆడితే మంచిదని రికీ పాంటింగ్‌, సంజయ్ మంజ్రేకర్‌ సూచిస్తున్నారు.


'షార్ట్‌ డెలివరీ ఎక్కువ బౌన్స్‌ అయినప్పుడు సర్‌ప్రైజ్‌ అవ్వకూడదు. విరాట్‌ కోహ్లీ ఈ మధ్య ఫ్రంట్‌ ఫూట్‌ ప్లేయర్‌గా మారాడు. ప్రతి బంతినీ క్రీజు ముందుకొచ్చి ఆడుతున్నాడు. మీరు పిచ్‌ మ్యాప్‌,  పిక్చర్స్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తే మిచెల్‌ స్టార్క్‌ వేసిన బంతి వికెట్‌ మధ్యలో పిచ్‌ అయినట్టు కనిపిస్తుంది. అంటే అది షార్ట్‌ డెలివరీ. ఇలాంటి బంతిని ఆడేందుకు అతడు ముందుకొచ్చాడు. అతడి రెండు కాళ్లూ క్రీజు బయటే ఉన్నాయి. ఇలాంటి పొజిషన్లోకి వచ్చినప్పుడు బంతి బౌన్స్‌ అయితే మరో అవకాశం ఉండదు' అని సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు.


'ప్రతి బంతిని ఆడేందుకు ముందుకొస్తుండటంతో విరాట్‌ కోహ్లీ పరుగులు చేసేందుకు శ్రమిస్తున్నాడు. ఈ మ్యాచు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌, ట్రావిస్ హెడ్‌ భారీ స్కోర్లు చేశారు. ఎందుకంటే వారిద్దరూ బ్యాక్‌ఫుట్‌ ఆటగాళ్లు. అందుకే కోహ్లీ ఏదో ఒక దశలో బ్యాక్ ఫుట్‌లో ఆడటం మంచిది. రహానె ఇప్పటికే ఆ పని చేస్తున్నాడు' అని మంజ్రేకర్‌ వెల్లడించాడు.


ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. చివరి రోజు భారత్ విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా గెలవాలంటే ఏడు వికెట్లు తీయాలి. కాబట్టి ఈ మ్యాచ్‌లో అన్ని రకాల ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్న మాట. క్రీజులో విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్: 60 బంతుల్లో, ఏడు ఫోర్లు), అజింక్య రహానే (20 బ్యాటింగ్: 59 బంతుల్లో, మూడు ఫోర్లు) ఉన్నారు.


అంతకు ముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 173 పరుగుల తొలి  ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌కు ఆదిలోనే సిరాజ్, ఉమేశ్ లు డబుల్ స్ట్రోక్ ఇచ్చారు.  డేవిడ్ వార్నర్ (1) ను సిరాజ్ ఔట్ చేయగా ఉస్మాన్ ఖవాజా (13) ను ఉమేశ్ పెవిలియన్ పంపాడు. ఈ ఇద్దరూ వికెట్ కీపర్ భరత్‌కే క్యాచ్ లు ఇచ్చారు.