WTC Final 2023: ఐసీసీ ట్రోఫీ నాకౌట్ స్టేజ్‌లో భారత జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. టీమిండియా చివరిసారి ఐసీసీ ట్రోఫీ నెగ్గి ఈనెల 23 కు పదేండ్లు పూర్తవుతాయి. ఇంగ్లాండ్‌లో 2013 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (జూన్ 23న ఇంగ్లాండ్‌తో ఫైనల్ ముగిసింది)యే టీమిండియాకు ఆఖరి ఐసీసీ ట్రోఫీ. ఈ దశాబ్దకాలంలో భారత్ పలుమార్లు ఛాంపియన్ అవడానికి దగ్గరగా వచ్చింది. కానీ ప్రతీసారి టీమిండియా ఫ్యాన్స్‌కు ఆర్తనాదాలే మిగిలాయే తప్ప భారత ఆటగాళ్లు అద్భుతాలు చేయలేదు. వరుసగా రెండోసారి ఐసీసీ ‘గద’ను దక్కించుకునే పోరులో భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా టీమిండియా మాత్రం మరోసారి నిరాశపరించింది. దీంతో అభిమానులకు మరోసారి ‘వ్యథ’ మిగిలింది.
2014 నుంచి మొదలు..
2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత జట్టు 2014లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరింది. తుదిపోరులో శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడింది. ఇక్కడ మొదలైన అపజయాల పరంపర ఆచారంగా కొనసాగుతూనే ఉంది.
- 2015 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
- 2016 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో భారత్‌కు పరాభవం తప్పలేదు.
- 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్.. టీమిండియాకు చిత్తుచిత్తుగా ఓడించింది.
- 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడింది. టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరు అంతర్జాతీయ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ధోని రనౌట్ ఇప్పటికీ టీమిండియా అభిమానుల కళ్లల్లో మెదులుతూనే ఉంది.
- 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ మనకు మరోసారి షాకిచ్చింది. ఐసీసీ నిర్వహించిన తొలి డబ్ల్యూటీసీ 2019 - 2021 సైకిల్ మొత్తం దుమ్మురేపిన టీమిండియా ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది.
- 2022 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరింది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది.
- 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా భారత్‌కు నిరాశ తప్పలేదు. ఆస్ట్రేలియా మరోసారి భారత్‌ను ఓడించింది.
అభిమానులకు మళ్లీ నిరాశే..
ఒక్క ఐసీసీ ట్రోఫీ కోసం పదేండ్లుగా కళ్లు కాయలు కాచేలా చూస్తున్న భారత క్రికెట్ జట్టు అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. రెండేండ్ల పాటు టెస్టులలో పడుతూ లేస్తూ ఫైనల్ చేరిన టీమిండియా.. ఓవల్‌లో మరో అవమానకర ఓటమిని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఏడ్చి ఏడ్చి మా కన్నీళ్లు ఇంకిపోయాయయన్నా.. ఇంకెప్పుడన్నా మీరు ఐసీసీ ట్రోఫీ గెలిచేది..?’అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రోఫీ పోయిన ప్రతీసారి నెక్స్ట్ చూసుకుందాంలే అనుకుంటూ వస్తున్నా.. ఇలా అనుకోబట్టే పదేండ్లు గడిచిపోయింది. మరి ఐసీసీ టోర్నీలలో బాగా ఆడటం లేదా..? అంటే లీగ్ దశలో సూపర్ డూపర్ ఆట ఆడుతున్న మన వీరులు నాకౌట్ దశకు వచ్చేసరికి మాత్రం ఒత్తిడికి తట్టుకోలేక చేతులెత్తేస్తున్నారు. పైన పేర్కొన్న చాలామట్టుకు మ్యాచ్‌లు స్వల్ప తేడాతో ఓడిపోయినవే కావడం గమనార్హం.
ఇక ఈ ఏడాదే రోహిత్ సేన స్వదేశంలో భారత్ మరో ఐసీసీ ట్రోఫీ ఆడనుంది. ఈ ఏడాడి అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ లో అయినా భారత జట్టు అభిమానుల దశాబ్ది కలను నిజం చేస్తుందో లేదో మరి..! పదేండ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ మెన్ ఇన్ బ్లూ చెంత చేరేదెప్పుడో..?