WTC Final 2023: 


నాలుగేళ్లలో రెండుసార్లు ఫైనల్‌ చేరడం గొప్ప విషయమేనని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ఫైనల్లో వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేదని పేర్కొన్నాడు. ఈ రెండేళ్లలో ఎన్నోసార్లు అద్భుత విజయాలు అందుకున్నామని గుర్తు చేశాడు. ఇకపైనా అభిమానులను తలెత్తుకొనేలా చేస్తామని వెల్లడించాడు.


'ఓటమిని జీర్ణించుకోవడం సులభం కాదు. టాస్‌ గెలిచాక మేం శుభారంభమే చేశాం. తొలి సెషన్లో మంచి బౌలింగ్‌ చేశాం. ఆ తర్వాత మమ్మల్ని మేమే వెనక్కి నెట్టేసుకున్నాం. ఏదేమైనా ఆస్ట్రేలియా బ్యాటర్లకు క్రెడిట్‌ దక్కుతుంది. ట్రావిస్‌ హెడ్‌ అద్భుతంగా ఆడాడు. అప్పట్నుంచే మ్యాచ్‌పై పట్టు కోల్పోయాం. అక్కడ్నుంచి పుంజుకోవాలంటే కష్టపడాలని తెలుసు. దాంతో ఎంతో శ్రమించాం. ఆసీస్‌కు అభినందనలు' అని రోహిత్‌ శర్మ అన్నాడు.


'మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎన్నో వ్యూహాల గురించి చర్చించుకున్నాం. కఠిన లెంగ్తుల్లో బంతులేయాలని అనుకున్నాం. కానీ అవేవీ పనిచేయలేదు. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి. టీమ్‌ఇండియా 150కే 5 వికెట్లు చేజార్చుకున్నప్పుడు అజింక్య రహానె, శార్దూల్‌ ఠాకూర్‌ ఎంతో శ్రమించారు. మాకోసం పోరాడారు. మంచి భాగస్వామ్యంతో మమ్మల్ని నిలబెట్టారు. రెండో ఇన్నింగ్సులో మంచి బౌలింగే చేశాం. బ్యాటుతో మళ్లీ విఫలమయ్యాం' అని రోహిత్‌ చెప్పాడు.


'ఓవల్ పిచ్‌ చాలా బాగుంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. కానీ మేమే దానిని అందిపుచ్చుకోలేదు. నాలుగేళ్లలో రెండు ఫైనళ్లు చేరేందుకు మేమెంతో కష్టపడ్డాం. ఈ మ్యాచ్‌ ఓడిపోవడం బాధాకరం. ఇకపై మరింత మెరుగ్గా ఆడాలి. అయితే ఈ రెండేళ్లలో మేమేం చేశామో మర్చిపోవద్దు. ఎంతో శ్రమించాం. ఆయా సిరీసుల్లో ఎంతో మంది ఆటగాళ్లు భాగస్వాములు అయ్యారు. వచ్చే ఛాంపియన్‌షిప్‌ కోసం మేం అలుపెరగక యుద్ధం చేస్తాం. తలెత్తుకొని నిలబడతాం' అని హిట్‌మ్యాన్‌ వెల్లడించాడు.




ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గదను సొంతం చేసుకొనేందుకు 444 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా అందులో కనీసం ముప్పావు స్కోరైనా చేయలేదు. రెండో ఇన్నింగ్సులో 63.3 ఓవర్లు ఆడి 234 పరుగులకే ఆలౌటైంది. ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. విరాట్‌ కోహ్లీ (49; 78 బంతుల్లో 7x4), అజింక్య రహానె (46; 108 బంతుల్లో 7x4), రోహిత్‌ శర్మ (43; 60 బంతుల్లో 7x4, 1x6) టాప్‌ స్కోరర్లు. చెతేశ్వర్‌ పుజారా (27; 47 బంతుల్లో 5x4), శ్రీకర్ భరత్‌ (23; 41 బంతుల్లో 2x4) ఏదో మోస్తరు స్కోర్లు చేశారు.


ఆఖరి రోజు ఓవర్‌ నైట్ స్కోరు 164/3తో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా 70 పరుగులైనా చేయలేదు. ఆట మొదలైన పావు గంటకే విరాట్‌ కోహ్లీ ఔటయ్యాడు. స్కాట్‌ బొలాండ్‌ దేహానికి దూరంగా విసిరిన బంతిని ఆడి స్లిప్‌లో స్టీవ్‌ స్మిత్‌ చేతికి చిక్కాడు. ఆడాలా వద్దా అన్న డౌట్‌తో ఆడి పెవిలియన్‌ చేరాడు. అప్పటికి స్కోరు 179/4. ఇదే పెద్ద షాక్‌ అనుకుంటే బంతి వ్యవధిలోనే రవీంద్ర జడేజా (0) ఔటవ్వడం గమనార్హం. కాస్త ఆఫ్సైడ్‌ వెళ్లిన బంతి జడ్డూ బ్యాటు అంచుకు తగిలి కీపర్‌ కేరీ చేతుల్లో పడింది. ఈ సిచ్యువేషన్లో జింక్స్‌, కేఎస్ భరత్ నిలదొక్కుకొనేందుకు ప్రయత్నించారు. అయితే జట్టు స్కోరు 212 వద్ద రహానెను స్టార్క్‌ ఔట్‌ చేశాడు. మరో పరుగుకే శార్దూల్‌ ఠాకూర్‌ (0) డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత భరత్‌, ఉమేశ్ (1), సిరాజ్‌ (1) ఔటవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు.