WPL Auction 2023:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా.. భారత్ మరియు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన జట్టు ముంబయికు శుభాకాంక్షలు తెలిపాడు. డబ్ల్యూపీఎల్ ప్రారంభ ఎడిషన్ కోసం సోమవారం వేలం జరిగింది. ఇందులో తన ఫ్రాంచైజీ అయిన ముంబైకు రోహిత్ శర్మ అభినందనలు తెలిపాడు. మా కుటుంబం ఇప్పుడు పెద్దదిగా, బలంగా మారింది. వేలాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు ముంబయికు అభినందనలు. మా మహిళల జట్టును బ్లూ మరియు గోల్డ్ జెర్సీలో చూడడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం అని రోహిత్ ట్వీట్ చేశాడు. 


హర్మన్ ను దక్కించుకున్న ముంబయి


డబ్ల్యూపీఎల్ వేలంలో భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను ముంబై దక్కించుకుంది. హర్మన్ కోసం మొదట ఆర్సీబీ బిడ్ ను ప్రారంభించగా.. ముంబై పోటీపడింది. చివరకు రూ. 1.8 కోట్లకు హర్మన్ ప్రీత్ ను ముంబయి దక్కించుకుంది. ఇక డబ్ల్యూపీఎల్ లో ముంబై జట్టుకు హర్మన్ నే నాయకత్వం వహించే అవకాశం ఉంది. వేలంలో ముంబై ఇండియన్స్ ఇంకా నాట్ స్కివర్ బ్రంట్ (ఇంగ్లండ్), అమేలియా కెర్ (న్యూజిలాండ్, పూజా వస్త్రాకర్ (భారత్), యాస్తికా భాటియా (భారత్), హీథర్ గ్రాహం (ఆస్ట్రేలియా), ఇస్సీ వాంగ్ (ఇంగ్లండ్), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) క్లో ట్రయాన్ (దక్షిణాఫ్రికా) వంటి స్టార్ క్రీడాకారిణులను కొనుగోలు చేసింది. 


మహిళల ప్రీమియర్ లీగ్ జట్ల కోచ్‌లు ఎవరు?


జనాథన్ బట్టీ (ఢిల్లీ క్యాపిటల్స్), షార్లెట్ ఎడ్వర్డ్స్ (ముంబై ఇండియన్స్), రాచెల్ హేన్స్ (గుజరాత్ జెయింట్స్) జోన్ లూయిస్ (యూపీ వారియర్స్). రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా తమ కోచ్‌ని ప్రకటించలేదు.






ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ ఎడిషన్ మార్చి 4 నుంచి 26 వరకు జరగనుంది. ముంబైలోని 2 వేదికలలో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. 5 ఫ్రాంచైజీ జట్లు పోటీలో ఉన్నాయి. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. 


ముంబయి ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ స్క్వాడ్


హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, ధార గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, ప్రియాంక నేయిరాలామ్ బాలా, హుమా కాజ్ బిష్ట్, జింతామణి కలిత, సోనమ్ యాదవ్.