Shubman Gill:  టీమిండియా నయా సంచలన బ్యాటర్ శుభ్ మన్ గిల్ 2023 జనవరి నెలకు గాను 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' గా ఎంపికయ్యాడు. ఇటీవల అద్భుత ఫాంలో ఉన్న గిల్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో పరుగుల వరద పారించాడు. వన్డేలు, టీ20ల్లో శతకాలతో చెలరేగాడు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీసుల్లో కలిపి మొత్తం 567 పరుగులు సాధించాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 2 సెంచరీలు ఉన్నాయి. 


గతేడాది వన్డేల్లో గిల్ మంచి ప్రదర్శన కనబరిచాడు. అలాగే బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో తన తొలి టెస్ట్ శతకాన్ని అందుకున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ తో గిల్ పొట్టి ఫార్మాట్ లో అరంగేట్రం చేశాడు. అయితే ఆ సిరీస్ లో అనుకున్నంతగా రాణించలేదు. వన్డేల్లో మాత్రం ఆకట్టుకున్నాడు. 3 ఇన్నింగ్సుల్లో 207 పరుగులు చేశాడు. తొలి, మూడో వన్డేల్లో వరుసగా 70, 116 పరుగులు సాధించాడు. 


తొలి డబుల్ సెంచరీ


న్యూజిలాండ్ తో జరిగిన 3 వన్డేల సిరీస్ లో గిల్ అదరగొట్టాడు. హైదరాబాద్ లో జరిగిన తొలి మ్యాచ్ లో సహచరులందరూ విఫలమైనా గిల్ డబుల్ సెంచరీ బాదాడు. 149 బంతుల్లో 208 పరుగులు చేసిన శుభ్ మన్.. వన్డేల్లో అతి పిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే భారత్ తరఫున వన్డేల్లో ద్విశతకం బాదిన 5వ బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లోనూ గిల్ రాణించాడు. వరుసగా 40 నాటౌట్, 112 పరుగులు చేశాడు. కివీస్ తో టీ20 సిరీస్ లోనూ గిల్ ఆకట్టుకున్నాడు. తొలి 2 మ్యాచుల్లో విఫలమైనప్పటికీ.. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో 63 బంతుల్లోనే 126 పరుగులు చేసి అదరగొట్టాడు. దీంతో సచిన్, రోహిత్, రైనా, కోహ్లీ తర్వాత ప్రతి ఫార్మాట్ లోనూ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్ గా నిలిచాడు. 






గిల్ పై రమీజ్ రజా ప్రశంసలు


పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా... భారత యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ యువ క్రికెటర్ తనను తాను మలచుకున్న విధానం ఆకట్టుకుందన్నాడు. అలాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ కు మధ్య ఉన్న పోలికల గురించి వివరించాడు. గిల్, రోహిత్ కు మిని వర్షన్ అని రమీజ్ పేర్కొన్నాడు. 


'శుభ్ మన్ గిల్ మినీ రోహిత్ లా కనిపిస్తాడు. అతనికి ఇంకా చాలా సమయం ఉంది. తగినంత సామర్థ్యం ఉంది. సమయంతో పాటు దూకుడు కూడా అభివృద్ధి చెందుతుంది. గిల్ ఏమీ మార్చుకోవాల్సిన అవసరం లేదు.' అని తన యూట్యూబ్ ఛానల్ లో రమీజ్ రజా పేర్కొన్నాడు. రోహిత్ శర్మ లాంటి అత్యుత్తమ బ్యాటర్ భారత్ కు ఉన్నందున వారికి బ్యాటింగ్ చేయడం సులభమని రమీజ్ అన్నాడు. 'రోహిత్ హుక్ అండ్ పుల్ షాట్లు కొట్టడంలో అద్భుతమైన స్ట్రైకర్. అతను చాలా బాగా ఆడతాడు. కాబట్టి భారత్ కు బ్యాటింగ్ చేయడం సులభం' అని రమీజ్ రజా వ్యాఖ్యానించాడు.