Border Gavaskar Trophy:  బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ కు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా దూరమయ్యాడు. ఇప్పుడు అతను రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. 


వెన్నుగాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్ సీఏ)లో కోలుకుంటున్నాడు. అక్కడ తను ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం గాయపడి జట్టుకు దూరమైన ఆటగాడు.. అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాలంటే కనీసం ఏదో ఒక దేశవాళీ మ్యాచ్ ఆడాలి. రెండో టెస్టుకు ఇంకా 3 రోజుల సమయమే ఉంది. కాబట్టి ఇప్పుడు శ్రేయస్ నేరుగా ఆసీస్ తో టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం లేదు. 


అయ్యర్ నెలరోజులుగా పోటీ క్రికెట్ ఆడలేదు. ఇరానీ కప్ లో భాగంగా రెస్ట్ ఆఫ్ ఇండియా- మధ్యప్రదేశ్ మధ్య మార్చి 1 నుంచి 5 వరకు మ్యాచ్ జరగనుంది. మరి ఇందులో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున శ్రేయస్ ను బీసీసీఐ ఆడిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఆ మ్యాచ్ కు ఎంపికైత్ శ్రేయస్ తన ఫిట్ నెస్ ను నిరూపించుకుని భారత జట్టులోకి రావచ్చు. 






బుమ్రా ఐపీఎల్ తర్వాతే


భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది జరిగే ఐపీఎల్ తర్వాతే భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అయితే అతన్ని ఎంపిక చేసే విషయంలో బీసీసీఐ తొందరపడడంలేదు. కాబట్టి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ మొత్తానికి బుమ్రా దూరమైనట్లే. ఒకవేళ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితే అప్పుడు బుమ్రాను ఎంపిక చేయవచ్చు. అలాగే అక్టోబర్ లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ఉంది. దానికి బుమ్రా అందుబాటులో ఉండడం చాలా అవసరం. కాబట్టి బుమ్రాను జట్టులోకి ఎంపిక చేసే విషయంలో టీం మేనేజ్ మెంట్ ఆచితూచి వ్వవహరిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాతే బుమ్రా జాతీయ జట్టులోకి తిరిగి రానున్నాడు. 


భారత్- ఆస్ట్రేలియా సిరీస్


భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానుంది. దీనికోసం ఇరు జట్లు నెట్స్ లో చెమటోడుస్తున్నాయి. ఆసీస్ బ్యాటర్లు స్పిన్ ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టారు. సోమవారం పుజారా, కేఎస్ భరత తదితర ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేశారు. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ లో ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని భారత్ ఆలోచిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ లో  విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.