WPL 2024 Final RCB conquer Delhi Capitals by 8 wickets clinch maiden WPL title: ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) చరిత్ర సృష్టించింది. పురుషుల జట్టు సాధింలేని ఘన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ విజేతగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో ఏకపక్షంగా  సాగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో బెంగళూరు  ఘన విజయం సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీని... బెంగళూరు బౌలర్లు కట్టడి చేశారు. కేవలం 113 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్‌ను కట్టడి చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి బెంగళూరు ఛేదించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (31), సోఫీ డివైన్‌ (32) తొలివికెట్‌కు 49 పరుగుల మంచి శుభారంభం అందించారు. అనంతరం రిచా ఘోష్‌ 17 సహకారంతో ఎలీస్‌ పెర్రీ మ్యాచ్‌ను ముగించింది. ఈ విజయంతో తొలిసారి బెంగళూరు ఖాతాలో కప్పు చేరింది.




ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టుకు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభంలో దూకుడుగా ఆడిన ఆ జట్టును.. కట్టుదిట్టంగా బంతులు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫలితంగా ఆ జట్టు 113 పరుగులకే ఢిల్లీ కుప్పకూలింది. ఓపెనర్లు షెఫాలి వర్మ (44), మెగ్ లానింగ్ (23) మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. తొలి వికెట్‌కు 64 పరుగుల జోడించి పటిష్టంగా కనిపించిన ఢిల్లీ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంకా పాటిల్‌ 4, సోఫీ మోలినక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు.




తొలిసారి ఫైనల్‌ చేరి...
వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL)లో బెంగళూరు( Royal Challengers Bangalore) అదరగొట్టింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)ను చిత్తుచేస్తూ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సమష్టి ప్రదర్శనతో తక్కువ పరుగులను కాపాడుకుని బలమైన ముంబైని బెంగళూరు మట్టికరిపించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. ఎలీస్‌ పెర్రీ అర్ధ శతకంతో తొలుత 135 పరుగులు చేసిన బెంగళూరు... ముంబైను 130 పరుగులకే పరిమితం చేసి విజయం సాధించింది. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. ముంబై బౌలర్ల ధాటికి బెంగళూరు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆరు ఓవర్లు ముగిసే సరికి ముంబై 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సోఫీ డివైన్‌ 10, కెప్టెన్‌ స్మృతి మంధాన 10, దిశా 0 పరుగులకే పెవిలియన్‌ చేరారు.


ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఫెర్రీ మరోసారి బెంగళూరును ఆదుకుంది. వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడిన పెర్రీ.. స్కోరింగ్‌ రేట్‌ మరీ పడిపోకుండా చూసింది. పెర్రీ 40 బంతుల్లో అర్ధసెంచరీ అందుకుంది. ఆఖరి ఓవర్లో ఆమె ఔటైనా.. చివరి బంతికి సిక్స్‌ బాదిన జార్జియా స్కోరు 130 దాటించింది. ముంబై బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్‌, నాట్‌ సీవర్‌, సైకా ఇషాక్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముంబైను 130 పరుగులకే పరిమితం చేసి విజయం సాధించింది. ఈ గెలుపుతో ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ... ఢిల్లీ క్యాపిటల్స్‌ను కూడా చిత్తు చేసి కప్పును ఒడిసిపట్టింది.