RCBW vs DCW:
విమెన్ ప్రీమియర్ లీగులో రెండో మ్యాచ్ జరుగుతోంది. ముంబయిలోని బ్రబౌర్న్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ తలపడున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఫీల్డింగ్ ఎంచుకుంది.
వికెట్ తాజాగా ఉందని స్మృతి మంధాన తెలిపింది. పిచ్‌పై పచ్చిక ఉందని వెల్లడించింది. తమ వద్ద నాణ్యమైన పేసర్లు ఉన్నారంది. ఎలిస్ పెర్రీ, మేఘాన్ షూట్, సోఫీ డివైన్, హీథరనైట్ చక్కగా బౌలింగ్ చేస్తారని ధీమాగా ఉంది. తమ ప్రతిభను ప్రదర్శించుకొనేందుకు విమెన్ ప్రీమియర్ లీగ్ చక్కని వేదికగా వర్ణించింది. ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఎంతో బాగుందని ప్రశంసించింది. దిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బందేమీ లేదంది. జట్టులో ముగ్గురు స్పిన్నర్లు, పేసర్లు ఉన్నారని పేర్కొంది. ఆల్‌రౌండర్లకు కొదవ లేదంది. మ్యాచ్‌కు ముందు బాగానే ప్రాక్టీస్ చేశామని వెల్లడించింది.
తుది జట్లు
దిల్లీ క్యాపిటల్స్ : షెఫాలీ వర్మ, మెగ్ లానింగ్, మారిజాన్ కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలీస్ కాప్సీ, జెస్ జొనాసెన్, తానియా భాటియా, అరుంధతీ రెడ్డీ, శిఖా పాండే, రాధా యాదవ్, టారా నోరిస్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్, దిశా కసత్, ఎలిస్ పెర్రీ, రిచా ఘోష్, హెథర్ నైట్, కనికా అహుజా, ఆశా శోభన, ప్రీతి బోస్, మేఘాన్ షూట్, రేణుకా సింగ్
పిచ్ ఎలా ఉందంటే?
'వాతావరణం వేడిగా ఉంది. రెండు జట్లకూ ఇదే తొలిమ్యాచ్. ఇది ఎర్రమట్టి పిచ్. పరుగులు ఎక్కువగా వస్తాయి. పిచ్ ఫ్లాట్‌గా ఉంది. వికెట్ వేగంగా ఉంటుంది. బౌండరీలు చిన్నవి. ఒకవైపు వికెట్ల వెనకాల బౌండరీ 46 మీటర్లే. బ్యాటర్లు అటువైపు టార్గెట్ చేస్తే ఎక్కువ పరుగులు వస్తాయి. స్క్వేర్ వైపు పరుగులు ఎక్కువగా వస్తాయి. పేసర్లు ప్రభావం చూపగలరు' అని జూలియా ప్రైస్, రోహన్ గవాస్కర్ అన్నారు.
బ్యాలెన్స్‌డ్‌గా ఆర్సీబీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) అత్యంత సమతూకంగా కనిపిస్తోంది. స్మృతి మంధాన, దిశా కసత్‌తో టాప్ ఆర్డర్ బాగుంది. సోఫీ డివైన్, ఎలిస్ పెర్రీ, డేన్ వాన్ నీకెర్గ్, రిచా ఘోష్‌తో కూడిన మిడిలార్డర్ దుమ్మరేపగలదు. తనకు బాగా తెలిసిన ఉపఖండం పరిస్థితులను గట్టిగా ఉపయోగించుకోవాలని స్మృతి పట్టుదలగా ఉంది. విదేశీ, స్వదేశీ అమ్మాయిలతో సమతూకం కోసం ప్రయత్నిస్తోంది. ఎక్కువ మంది స్టార్లు విదేశీయులు కావడంతో ఎంపికలో కొంత తలనొప్పి తప్పదు. మేఘన్ షూట్, రేణుకా సింగ్, ఎలిస్ పెర్రీతో పేస్ బలంగా ఉంది. నీకెర్గ్ స్పిన్ వేయగలదు.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ డీసీ
దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) యంగ్, సీనియర్ క్రికెటర్ల సమ్మేళనంతో కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లు గెలవడంలో డీసీ కెప్టెన్ మెగ్‌లానింగ్‌కు తిరుగులేదు. ఈ మధ్యే దక్షిణాఫ్రికాలో కప్పు ముద్దాడి వస్తోందామె. గెలుపు సంస్కృతిని డీసీలో ప్రవేశపెడతానని ఆమె అంటోంది. సరైన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకొనేందుకు టీమ్‌ఇండియా యువ కెరటాలు జెమీమా, షెఫాలీ సాయం తీసుకుంటానని అంటోంది. షెఫాలి, జెమీమా, లానింగ్‌తో టాప్ ఆర్డర్ భయంకరంగా ఉంది. వీరిలో ఏ ఒక్కరు నిలిచినా పరుగుల వరదే. మారిజాన్ కాప్, లారా హ్యారిస్, జైసా అక్తర్, తానియా భాటియా మిడిలార్డర్లో కీలకం అవుతారు. రాధాయాదవ్, జెస్ జొనాసెన్, పూనమ్ యాదవ్ బంతిని గింగిరాలు తిప్పుతూ మాయ చేయగలరు. శిఖా పాండే, కాప్, టారా నోరిస్ పేస్ బౌలింగ్ చూస్తారు. మిగిలిన పేసర్లకు అనుభవం తక్కువ.