RCBW vs DCW: 


విమెన్‌ ప్రీమియర్‌ లీగులో అమ్మాయిలు అదరగొడుతున్నారు. పరుగుల వరద పారిస్తున్నారు. కళ్లుచెదిరే సిక్సర్లు, దుమ్మురేపే బౌండరీలతో అలరిస్తున్నారు. అభిమానులతో ఈలలు వేయిస్తున్నారు. లీగులో రెండో మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌ వీర విధ్వంసం సృష్టించింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు 224 పరుగుల భారీ టార్గెట్‌ ఇచ్చింది.


లేడీ సెహ్వాగ్‌.. టీమ్‌ఇండియా యంగ్‌ సెన్సేషన్‌ షెఫాలీ వర్మ (84; 45 బంతుల్లో 10x4, 4x6) నాటు కొట్టుడు కొట్టింది. ఆమెకు తోడుగా డీసీ సారథి మెగ్‌ లానింగ్‌ (72; 43 బంతుల్లో 14x4) దంచికొట్టింది. వీరిద్దరూ ఆర్సీబీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. మారిజాన్‌ కాప్‌ (39*; 17 బంతుల్లో 3x4, 3x6), జెమీమా (22*; 15 బంతుల్లో 3x4, 0x6) సైతం అదరగొట్టేశారు.




ముందు ఇద్దరు!


బ్రబౌర్న్‌ మైదానం.. ఫ్లాట్‌ పిచ్‌.. చిన్న బౌండరీలు! లెంగ్తులు కుదరని బౌలింగ్‌! ఇంకేముంది టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌ పండగ చేసుకుంది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, మెగ్‌ లానింగ్‌ నువ్వా నేనా అన్నట్టు పోటీపడి మరీ చితక బాదేశారు. షెఫాలీ ఆకాశమే హద్దుగా చెలరేగితే లానింగ్‌ బంతుల్ని నేలకు ముద్దాడేలా బౌండరీలకు పంపించింది. దాంతో పవర్‌ ప్లే ముగిసేసరికే డీసీ 57 పరుగులు చేసింది. ధాటికి తట్టుకోలేక ఆర్సీబీ వెంటనే స్ట్రాటజిక్ టైమ్‌ ఔట్‌ తీసుకుంది.


తర్వాత ఇద్దరు!


విరామం తర్వాతా డీసీ దూకుడు ఆగలేదు. షెఫాలీ 31 బంతుల్లో, లానింగ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీలు అందుకోవడంతో జట్టు స్కోరు 9.4 ఓవర్లకు 100, 13.4 ఓవర్లకు 150 చేరుకుంది. 162 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం అందించిన ఈ జోడీని 13.3వ బంతికి లానింగ్‌ను ఔట్‌ చేయడం ద్వారా హేథర్ నైట్‌ విడదీసింది. మరో బంతి వ్యవధిలోనే షెఫాలీని పెవిలియన్‌ పంపించేసింది. దాంతో త్రుటిలో సెంచరీ చేజార్చుకుంది. ఓపెనర్లు అందించిన మెరుపు ఓపెనింగ్‌తో మిగతా బ్యాటర్లూ రెచ్చిపోయారు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ మారిజానె కాప్‌, టీమ్‌ఇండియా రాక్‌స్టార్‌ జెమీమా రోడ్రిగ్స్‌ సిక్సర్లు, బౌండరీలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. 18.2 ఓవర్లకే స్కోరు 200 దాటించారు. వీరిద్దరూ 31 బంతుల్లో 60 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో డీసీ స్కోరు 223/2కు చేరుకుంది.


దిల్లీ క్యాపిటల్స్‌ : షెఫాలీ వర్మ, మెగ్‌ లానింగ్‌, మారిజాన్‌ కాప్‌, జెమీమా రోడ్రిగ్స్‌, అలీస్‌ కాప్సీ, జెస్‌ జొనాసెన్‌, తానియా భాటియా, అరుంధతీ రెడ్డీ, శిఖా పాండే, రాధా యాదవ్‌, టారా నోరిస్‌


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్‌, దిశా కసత్‌, ఎలిస్‌ పెర్రీ, రిచా ఘోష్‌, హెథర్‌ నైట్‌, కనికా అహుజా, ఆశా శోభన, ప్రీతి బోస్‌, మేఘాన్ షూట్‌, రేణుకా సింగ్‌