WPL 2023, MI-W vs GG-W:
గుజరాత్ జెయింట్స్ జూలు విదిల్చింది! అత్యంత పటిష్ఠమైన ముంబయి ఇండియన్స్‌ను తొలిసారి కట్టడి చేసింది. ప్రణాళికలను పక్కగా అమలు చేసింది. చక్కని బౌలింగ్, అంతకు మించిన ఫీల్డింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించింది. 20 ఓవర్లకు 162/8కు పరిమితం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (51; 30 బంతుల్లో 7x4, 2x6) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగింది. యస్తికా భాటియా (44; 37 బంతుల్లో 5x4, 1x6) రాణించింది. గుజరాత్ బౌలర్లంతా సమష్టిగా అదరగొట్టారు. యాష్లే గార్డ్‌నర్ 3 వికెట్లు పడగొట్టింది.
నిలకడగా టాప్ ఆర్డర్
సీసీఐ మైదానంలో జరుగుతున్న ఈ పోరులో గుజరాత్ టాస్ గెలిచి వెంటనే ఫీల్డింగ్ ఎంచుకొంది. పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేసింది. ముంబయి ఇండియన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. ఒక పరుగు వద్దే హేలీ మాథ్యూస్ (0) యాష్లే గార్డ్‌నర్ ఔట్ చేసింది. దాంతో మరో ఓపెనర్ యస్తికా భాటియా, నాట్ సివర్ (36; 31 బంతుల్లో 5x4, 1x6) ఆచితూచి ఆడారు. మూడు ఓవర్ల తర్వాతే పెద్ద షాట్లకు దిగారు. పవర్ ప్లే ముగిసే సరికి ముంబయిని 40/1తో నిలిపారు. డేంజరస్‌గా మారుతున్న ఈ జోడీని 10.6వ బంతికి సివర్‌ను ఔట్ చేయడం ద్వారా గార్త్ విడదీసింది. రెండో వికెట్‌కు 74(62 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యానికి తెరదించింది. మరికాసేపటికే యస్తికా రనౌటైంది.
హర్మన్ మెరుపు సిక్సర్లు
ఇబ్బందుల్లో పడ్డ ముంబయిని కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఆదుకొంది. అమెలియా కెర్ (19) సాయంతో 29 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దూకుడు పెంచిన కెర్‌ను జట్టు స్కోరు 135 వద్ద కన్వర్ ఔట్ చేసి గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చింది. ఇస్సీ వాంగ్ (0), హమైరా కాజి (2) ఎక్కువసేపు నిలవలేదు. అయినప్పటికీ హర్మన్ పట్టు వదల్లేదు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకొంది. 19వ ఓవర్లో 2 సిక్సర్లు, 20వ ఓవర్లో 2 బౌండరీలు బాదేసి స్కోరును 150 దాటించేసింది. ఆ తర్వాత ఆమె ఔటవ్వడంతో ముంబయి 162కు పరిమితమైంది.
తుది జట్లు
ముంబయి ఇండియన్స్ : హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), నాట్ స్కీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కెర్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్
గుజరాత్ జెయింట్స్: సోఫీ డంక్లీ, మేఘన, హర్లీన్ డియోల్, యాష్లే గార్డ్‌నర్, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అనబెల్ సుథర్‌ల్యాండ్, రాణా, తనుజా కన్వార్, కిమ్ గార్త్, మాన్సీ జోషీ