MI-W vs GG-W, Match Preview:
విమెన్ ప్రీమియర్ లీగులో నేడు 12వ మ్యాచ్ జరుగుతోంది. అపజయమే ఎరగని ముంబయి ఇండియన్స్ (Mumbai Indians), విజయాల కోసం తపిస్తున్న గుజరాత్ జెయింట్స్‌ను (Gujarat Giants) రెండోసారి ఢీకొడుతోంది. బ్రబౌర్న్ మైదానం ఇందుకు వేదిక. మరి నేటి మ్యాచులో గెలిచేదెవరు? తుది జట్లలో ఎవరుంటారు?
సాహో.. ముంబయి!
అరంగేట్రం సీజన్లో మొదటి మ్యాచులో తలపడ్డ రెండు జట్లు గుజరాత్, ముంబయి! ఈ మ్యాచ్ విజయం నుంచీ హర్మన్‌ప్రీత్ సేన తిరుగులేని విధంగా దూసుకెళ్తోంది. వారిని అడ్డుకొనే వాళ్లు కనిపించడం లేదు. ఒకరు కాకపోతే మరొకరు నిలబడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ, వ్యూహాలు ఇలా అన్ని విభాగాల్లో వారు పటిష్ఠంగా ఉన్నారు.
ఓపెనింగ్‌లో హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా దంచికొడుతున్నారు. పవర్‌ప్లేలో భారీ స్కోర్లు అందిస్తున్నారు. మిడిలార్డర్లో నాట్ సివర్, హర్మన్, అమెలియా కెర్‌కు ఎదురులేదు. అసలు లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగే రావడం లేదు. బౌలింగ్‌లోనూ అంతే! ఇస్సీ వాంగ్ తన స్వింగ్‌తో చుక్కలు చూపిస్తోంది. సివర్, జింతామని కలిత ఫర్వాలేదు. స్పిన్నర్ సైకా ఇషాకిని ఆడటమే కష్టంగా ఉంది. టాప్ వికెట్ టేకర్ ఆమే. అవసరమైతే హేలీ, కెర్, హర్మన్ బంతిని తిప్పగలరు. వికెట్లు తీయగలరు. ఈ సీజన్లో డెత్ ఓవర్లలో బెస్ట్ ఎకానమీ 5.29 ముంబయిదే.
గుజరాత్ నిలుస్తుందా?
అనుకున్న స్థాయిలో విజయాలు దక్కడం లేదుగానీ గుజరాత్ జెయింట్స్ స్పోర్టింగ్ స్పిరిట్‌ను మెచ్చుకోవాల్సిందే! ఎన్ని కష్టాలొచ్చినా ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి దిగుతున్నారు. ఓపెనర్ మేఘనా నుంచి ఆశించిన ఓపెనింగ్స్ రావడం లేదు. ప్రతిభ ఉండటంతో మేనేజ్‌మెంట్‌ను ఆమెకు అండగా నిలుస్తోంది. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసిన సోఫియా డంక్లీపై అంచనాలు పెరిగాయి. హర్లీన్ డియోల్ మిడిలార్డర్లో ఆదుకొంటోంది. యాష్లే గార్డ్‌నర్ నుంచి ఇప్పటి వరకు మెరుపులు కనిపించలేదు. బెత్‌మూనీ స్థానంలో వచ్చిన లారా వోల్వ్‌వర్త్ ఏం చేస్తుందో చూడాలి. హేమలత, సుష్మా వర్మ హిట్టింగ్ చేయగలరు. గుజరాత్ బౌలింగ్ ఫర్వాలేదు. మానసి జోషీ, కిమ్ గార్త్ పేస్ బౌలింగ్ చూస్తున్నారు. స్నేహ్ రాణా, యాష్లే గార్డ్‌నర్ స్పిన్‌లో వికెట్లు తీయాల్సి ఉంది.ఈ సీజన్లో డెత్ ఓవర్లలో వరస్ట్ ఎకానమీ 14.71 గుజరాత్‌దే.
తుది జట్లు (అంచనా)
ముంబై ఇండియన్స్ : హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), నాట్ స్కీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్
గుజరాత్ జెయింట్స్: సోఫీ డంక్లీ, మేఘన, హర్లీన్ డియోల్, యాష్లే గార్డ్‌నర్, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అనబెల్ సుథర్‌ల్యాండ్, స్నేహ్ రాణా, తనుజా కన్వార్, కిమ్ గార్త్, మాన్సీ జోషీ