బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు టెస్టు సిరీస్ కోల్పోయినా మరో ట్రోఫీ కోసం వేట మొదలుపెట్టనుంది. ఈనెల 17 నుంచి భారత్ - ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. అయితే ఈ సిరీస్ లో ఆసీస్ రెగ్యులర్ సారథి పాట్ కమిన్స్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో చివరి రెండు టెస్టులలో ఆసీస్‌కు సారథిగా వ్యవహరించిన స్టీవ్ స్టిత్ వన్డేలకూ కెప్టెన్‌గా ఉండనున్నాడు.
ఇదే విషయమై ఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ స్పందిస్తూ.. ‘అవును.. కమిన్స్ తిరిగి రావడం లేదు. అతడు ఆస్ట్రేలియాలోనే ఉండనున్నాడు. ప్రస్తుతం మా ఆలోచనలన్నీ కమిన్స్, అతడి కుటుంబ సభ్యుల తోనే ఉన్నాయి..’అని తెలిపాడు. ఢిల్లీ టెస్టు ముగిశాక కమిన్స్.. ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. తన తల్లి క్యాన్సర్ తో బాధపడుతుండగా ఆమెను చూసుకోవడానికి ఆసీస్ సారథి సిడ్నీకి వెళ్లాడు. కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కమిన్స్ తల్లి ఇటీవలే మరణించింది.
వన్డే జట్టులో మార్పులు..
భారత్ తో వన్డే సిరీస్ కోసం ఇదివరకే 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కమిన్స్ వన్డేలకు కూడా మిస్ కావడంతో అతడి రిప్లేస్మెంట్ ను ప్రకటిస్తారని అనుకున్నా ఆసీస్ మాత్రం అలా ఏం చేయడం లేదు. కానీ ఇటీవలే గాయపడి సర్జరీ చేయించుకున్న జై రిచర్డ్‌సన్ స్థానంలో మాత్రం నాథన్ ఎల్లీస్ ను తీసుకుంది. ఇక బోర్డర్ - గవాస్కర్ ట్రోపీలో రెండు టెస్టులాడి గాయంతో ఇంటిముఖం పట్టిన వార్నర్.. వన్డే సిరీస్ కు మాత్రం ఇండియాకు రానున్నాడు. అతడితో పాటు ఆస్టన్ అగర్ కూడా జట్టుతో చేరతాడు.
వీళ్లే గాక నవంబర్ నుంచి గాయం కారణంగా క్రికెట్ కు దూరంగా ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్.. మార్చి 17 నుంచి మొదలుకాబోయే వన్డే సిరీస్ లో ఆడనున్నాడు. అంతేగాక టీ20 వరల్డ్ కప్ తర్వాత గాయంతో జట్టుకు దూరంగా ఉంటున్న షాన్ మార్ష్ కూడా టీమ్ లోకి రానున్నాడు.
కాగా టెస్టు సిరీస్ ను 2-1 తేడాతో భారత్ గెలిచిన నేపథ్యంలో కనీసం వన్డేలలో అయినా రాణించి టీమిండియాపై ఆధిపత్యం సాధించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. స్టార్ ప్లేయర్లు కూడా టీమ్ తో కలుస్తుండటంతో ఆ జట్టు భారత్‌కు షాకివ్వడానికి అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నది. మరి ఈ సిరీస్ లో కంగారూలు భారత్ ను ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి.
భారత్ తో వన్డే సిరీస్ కు ఆసీస్ జట్టు ఇదే : స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లీస్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
వన్డే సిరీస్ షెడ్యూల్:
- మార్చి 17న తొలి వన్డే - వాంఖెడే
- మార్చి 19న రెండో వన్డే - విశాఖపట్నం
- మార్చి 22న మూడో వన్డే - చెన్నై