DC-W vs RCB-W, Match Highlights:


ప్చ్‌..! రాలే..! కలిసి రాలే..! స్టేడియం మారినా ఆర్సీబీకి లక్కు కలిసి రాలే! విమెన్‌ ప్రీమియర్‌ లీగులో ఆ జట్టు వరుసగా ఐదో మ్యాచులోనూ పరాజయం చవిచూసింది. ఎంత ప్రయత్నించినా మంధానా బృందానికి అంతులేని విషాదమే మిగులుతోంది! తాజాగా దిల్లీ చేతిలో వరుసగా రెండో సారీ ఓడిపోయింది. 150 పరుగులను డిఫెండ్‌ చేసుకోలేకపోయింది. వారి దురదృష్టానికి తోడు మంచూ కొంపముంచింది. మోస్తారు టార్గెట్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్లు నష్టపోయి ఆఖరి ఓవర్లో ఛేదించింది. అలిస్‌ క్యాప్సీ (38; 24 బంతుల్లో 8x4) రాణించింది. మారిజానె కాప్‌ (32*; 32 బంతుల్లో 3x4, 1x6), జెస్‌ జొనాసెన్‌ (29*; 15 బంతుల్లో 4x4, 1x6) ఆఖరి వరకు నిలిచారు. అంతకు ముందు ఆర్సీబీలో ఎలిస్‌ పెర్రీ (67*; 52 బంతుల్లో 4x4, 5x6),  రిచా ఘోష్‌ (37; 16 బంతుల్లో 3x4, 3x6) మెరిశారు.


కలిసికట్టుగా దంచారు


సంక్లిష్టమైన ఛేదన! తక్కువా కాదు! ఎక్కువ కాదు! ఒక పరుగు వద్దే ఓపెనర్‌ షెఫాలీ వర్మ (0) డకౌటైంది. మెఘాన్‌ షూట్‌ ఆమెను క్లీన్‌బౌల్డ్‌ చేసేసింది. అయినా దిల్లీ క్యాపిటల్స్‌ వెరవలేదు. మెగ్‌ లానింగ్‌ (15) అండతో అలిస్ క్యాప్సీ దూకుడుగా ఆడింది. ఆమెను జట్టు స్కోరు 45 వద్ద ప్రీతీ బోస్‌ ఔట్‌ చేసింది. దాంతో డీసీ పవర్‌ ప్లే ముగిసే సరికి 52/2తో నిలిపింది. మరికాసేపటికే లానింగ్‌ను ఆశా పెవిలియన్‌కు పంపించింది. ఈ సిచ్యువేషన్లో జెమీమా రోడ్రిగ్స్‌ (32; 28 బంతుల్లో 3x4) నిలకడగా ఆడింది. మారిజాన్‌ కాప్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించింది. 14.3వ బంతికి ఆమెను ఆశా ఔట్‌ చేయడం డీసీ కాస్త నెమ్మదించింది. కానీ కాప్‌ ప్రత్యర్థి పైచేయి సాధించకుండా బ్యాటింగ్‌ చేసింది. జెస్‌ జొనాసెన్‌ షాట్లు ఆడేలా స్టాండింగ్‌ ఇచ్చింది. దాంతో మరో 2 బంతులు మిగిలుండగానే డీసీ విక్టరీ అందుకుంది. 






కెప్టెన్‌ నుంచి నో రన్స్‌!


ఎప్పట్లాగే ఆర్సీబీకి కోరుకున్న ఆరంభం దక్కలేదు. ఓపెనర్‌ స్మృతి మంధాన (8) జట్టు స్కోరు 24 వద్దే పెవిలియన్‌ చేరి నిరాశ పరిచింది. మొదట్లో కాస్త నిలదొక్కుకొనే ప్రయత్నం చేసినా లెగ్‌సైడ్‌ బంతి వేసి శిఖా పాండే ఆమెను ఉచ్చులో పడేసింది. ఫైన్‌ లెగ్‌లో భారీ షాట్‌ ఆడేలా చేసి ఔట్‌ చేసింది. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆర్సీబీ 29/1తో నిలిచింది. మరో ఓపెనర్‌ సోఫీ డివైన్‌ (21; 19 బంతుల్లో 3x4) షాట్లు ఆడేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. 8.6వ బంతికి ఆమెనూ శిఖాయే ఔట్‌ చేసింది. హీథర్‌ నైట్‌ (11) సైతం త్వరగానే డగౌట్‌ బాట పట్టింది. 


వారిద్దరూ దంచడం వల్లే!


ఒకవైపు పరుగులు రావడం లేదు. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టమైన లెంగ్తుల్లో బంతులేస్తున్నారు. అయినా ఎలిస్‌ పెర్రీ పట్టు వదల్లేదు. బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. అందివచ్చిన బంతుల్ని నేరుగా స్టాండ్స్‌లో పెట్టింది. 45 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి 16.1 ఓవర్లకు జట్టు స్కోరును 100 పరుగుల మైలురాయికి చేర్చింది. స్లాగ్‌ ఓవర్లలో ఆర్సీబీ దూకుడు పెంచింది. రిచా ఘోష్ కళ్లు చెదిరే సిక్సర్లతో చెలరేగింది. పెర్రీతో కలిసి నాలుగో వికెట్‌కు 34 బంతుల్లో 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. శిఖా పాండే వేసిన 18.2వ బంతిని కీపర్‌ వెనకాల స్కూప్‌ ఆడబోయి ఆమె ఔటైంది. ఆఖర్లో పెర్రీ ఒకట్రెండు సిక్సర్లు బాదడంతో స్కోరు 150/4కి చేరుకుంది. శ్రేయాంక పాటిల్‌ (4*)కు కనెక్షన్‌ కుదర్లేదు. డీసీ పేసర్‌ శిఖా పాండే (3/23) చక్కని బౌలింగ్‌తో అదరగొట్టింది.