DCW vs RCBW:


విమెన్‌ ప్రీమియర్‌ లీగులో పదకొండో మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన డీసీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. పిచ్‌పై సహకారాన్ని అందిపుచ్చుకుంటామని కెప్టెన్ మెగ్‌ లానింగ్‌ తెలిపింది. ఆర్సీబీలో మంచి క్రికెటర్లు ఉన్నారని పేర్కొంది. వారిని ఓడించాలంటే అత్యుత్తమంగా ఆడాల్సి ఉంటుందని వెల్లడించింది. పరిస్థితులను ఉపయోగించుకొని మెరుగైన స్కోరు చేసేందుకు ప్రయత్నిస్తాం. అలిస్‌ క్యాప్సీ, అరుంధతీ రెడ్డీని జట్టులోకి తీసుకున్నామని చెప్పింది.


'సీసీఐ మైదానం నుంచి ఎప్పుడెప్పుడు బయటపడతామా అని మేం ఎదురు చూశాం. మేం ఆడాలనుకున్నట్టుగా ఆడలేకపోయాం. ఇకనైనా మా అదృష్టంలో మార్పు వస్తుందేమో. ఆరు రోజుల్లోనే నాలుగు మ్యాచులు ఆడటంతో ఎక్కువ సమయ దొరకలేదు. ఎలాగోలా రెండు రోజుల విరామం దొరికింది. ఆదివారం చక్కగా ప్రాక్టీస్‌ చేశాం. జట్టులో కొన్ని మార్పులు చేశాం' అని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ స్మృతి మంధాన తెలిపింది.


పిచ్‌ ఎలా ఉందంటే?


వికెట్‌పై పచ్చిక బాగుంది. బౌండరీ సరిహద్దుల్లో కొన్ని మార్పులు చేశారు. రెండు స్క్వేర్‌ బౌండరీల మధ్య 5-6 మీటర్ల దూరం ఉంది. పిచ్‌ గట్టిగా ఉంది. పచ్చిక ఉండటంతో పేసర్లకు సహరిస్తుంది. ఈ ట్రాక్‌పై మారిజానె కాప్‌ రెచ్చిపోయే అవకాశాలు లేకపోలేదు. బ్యాటర్లు వికెట్‌పై సహనంతో ఉండటం అవసరం. కాస్త ఓపిక పడితే పరుగులు చేయొచ్చు. తొలి ఆరు ఓవర్లు సీమర్లు దుమ్మురేపొచ్చు.


తుది జట్లు


దిల్లీ క్యాపిటల్స్‌: మెగ్‌ లానింగ్‌, షెఫాలీ వర్మ, అలిస్‌ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్‌, మారిజానె కాప్‌,  జెస్‌ జొనాసెన్‌, అరుంధతీ రెడ్డి, తానియా భాటియా, శిఖా పాండే, రాధా యాదవ్‌, టారా నోరిస్‌


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్‌, ఎలిస్‌ పెర్రీ, హీథర్‌ నైట్‌, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్‌, దిశా కసత్‌, మేఘన్‌ షూట్‌, రేణుకా సింగ్‌, ఆశా శోభన, ప్రీతీ బోస్‌


ఇదీ ఆర్సీబీ సిచ్యువేషన్!


చూస్తేనేమో జట్టు నిండా స్టార్లే! ఇంటర్నేషనల్‌ వేదికలపై చెలరేగిన అమ్మాయిలే! ఏం జరిగిందో ఏంటో! ముంబయి పిచ్‌లపై మాత్రం వ్యూహాలు అమలు చేయలేక ఇబ్బంది పడుతోంది ఆర్సీబీ (RCB Women). నాయకత్వం నుంచి అన్ని విభాగాల్లోనూ ఆ జట్టుది వెనకంజే! ఇప్పటికే సగం సీజన్‌ ముగిసింది. నాలుగు మ్యాచులాడినా ఒక్కటీ గెలవలేదు. కనీసం నేడైనా విజయం సాధించాలని స్మృతి మంధాన (Smriti Mandhana) బృందం తహతహలాడుతోంది. పవర్‌ప్లే వరకు బాగానే 8.5 వరకు రన్‌రేట్‌ మెయింటేన్‌ చేస్తున్నా మిడిలార్డర్‌ కుదురుకోవడం లేదు. స్మృతి మంధాన ఒక్క మ్యాచులోనూ తనదైన శైలిలో విరుచుకుపడలేదు. పైగా స్పిన్నర్ల బౌలింగ్‌లో ఔటవుతోంది. సోఫీ డివైన్‌ టచ్‌లోకి వచ్చింది. ఎలిస్ పెర్రీ ఫర్వాలేదు. హీథర్‌నైట్‌కు మిగతావాళ్ల అండ దొరకడం లేదు. రిచా ఘోష్‌, కనికా అహుజా స్థాయికి తగ్గట్టు ఆడలేదు. శ్రేయాంక మాత్రం మంచి ఇంటెన్సిటీతో ఆశలు రేపుతోంది. బౌలింగ్‌లో ఒక్కరంటే ఒక్కరూ జట్టును ఆదుకోవడం లేదు. వికెట్లు తీయడం లేదు. అయితే టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో జట్టు ఆర్సీబీ కావడం విశేషం.