Rahul Dravid:


ఐపీఎల్‌ ఫైనల్‌ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మధ్య వారం రోజుల విరామమే ఉందని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) అన్నాడు. ఇంత తక్కువ వ్యవధిలో టెస్టు ఫైనల్‌కు సన్నద్ధమవ్వడం సులభమేమీ కాదన్నాడు. ఇందుకోసం బాగా ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేస్తామని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడాడు.


'ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఈ రోజు భోజనం విరామం తర్వాత అర్హత సాధించాం. ఇప్పట్నుంచే మా కుర్రాళ్లను కష్టపెట్టను. ముందు ఈ సిరీసు విజయాన్ని వేడుక చేసుకుంటాం' అని ద్రవిడ్‌ అన్నాడు.


'టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడటం సవాలే. ఐపీఎల్‌ ఫైనల్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కేవలం వారం రోజుల విరామమే ఉంది. కాబట్టి లాజిస్టిక్స్‌ పరంగా ఇబ్బందులు ఉంటాయి. దీనిపై మేం ఆలోచిస్తాం' అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ జూన్‌ 1న ముగుస్తుంది. టెస్టు ఫైనల్‌ లండన్‌లోని ఓవల్‌ మైదానంలో 7-11 మధ్య జరుగుతుంది.


బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో సంక్లిష్ట సమయాల్లో కుర్రాళ్లు అద్భుతంగా నిలబడ్డారని రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. ఆత్మవిశ్వాసంతో ఆడిన కుర్రాళ్లను ప్రశంసించాడు. 'మేం ఒత్తిడికి గురైన ప్రతిసారీ కుర్రాళ్లు చక్కగా స్పందించారు. దాన్నుంచి తప్పించుకొనేందుకు దారులు వెతికారు. అందుకే ఇలాంటి జట్టుకు కోచింగ్‌ ఇవ్వడం సంతోషానిస్తుంది. రోహిత్‌ చక్కని శతకంతో తొలి టెస్టును నడిపించాడు. విరాట్‌ కోహ్లీ అద్భుతమైన 186 పరుగుల ఇన్నింగ్సులో సిరీస్‌ను ముగించాడు. మధ్యలో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శుభ్‌మన్‌ గిల్‌ రాణించారు. కొన్నింటిని నేను వదిలేసుండొచ్చు. ఏదేమైనా మేం పోరాడాం' అని ద్రవిడ్‌ వెల్లడించాడు.


'ఐదారు నెలలుగా శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) తన ప్రదర్శనలతో ఉత్సాహం కలిగిస్తున్నాడు. ప్రతి సందర్భంలోనూ నిలబడుతున్నాడు. పరిణతి ప్రదర్శిస్తున్నాడు. ఇది మాకు శుభసూచకం. అతడు ఇలాగే ముందుకు సాగాలి. నైపుణ్యాలను మెరుగు పర్చుకొనేందుకు ఎంతో శ్రమిస్తాడు. విరాట్‌, రోహిత్‌, స్టీవ్‌ స్మిత్‌ నుంచీ ఎంతో నేర్చుకుంటున్నాడు. ఈ సిరీసులో నేథన్ లైయన్‌ నాయకత్వంలో ఆసీస్‌ స్పిన్నర్లు మెరుపులు మెరిపించారు. కునెమన్‌, మర్ఫీ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. వారికి కచ్చితంగా ఘనత దక్కాల్సిందే' అని ద్రవిడ్‌ తెలిపాడు.


IND vs AUS, 4th Test Highlights: 


అహ్మదాబాద్ టెస్టు చివరికి డ్రాగా ముగిసింది. ఐదోరోజు, సోమవారం 3/0తో ఆట మొదలు పెట్టిన ఆస్ట్రేలియా మూడు సెషన్లూ ఆడేసింది. 78.1 ఓవర్లకు 175/2తో నిలిచింది. మార్నస్‌ లబుషేన్‌ (63; 213 బంతుల్లో 7x4), స్టీవ్‌ స్మిత్‌ (10; 59 బంతుల్లో 2x4) అజేయంగా నిలిచారు. ఎలాగూ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు ముందుగానే మాట్లాడుకొని కరచాలనం చేసుకున్నారు. ఇందుకు అంపైర్లు అంగీకరించారు. దాంతో టీమ్‌ఇండియా ఈ సిరీసును 2-1 తేడాతో గెలిచింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. మరికొన్ని రోజుల్లోనే టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా (Team India vs Australia) ఇంగ్లాండ్‌లో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ (World Test Championship) ఫైనల్లో తలపడనున్నాయి.