WPL 2023, DC-W vs RCB-W:


విమెన్‌ ప్రీమియర్‌ లీగులో నేడు దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతున్నాయి. డీవై పాటిల్‌ మైదానం ఇందుకు వేదిక. ఇప్పటికే సగం సీజన్‌ ముగిసింది. ఆర్సీబీ మాత్రం ఇంకా గెలుపు బాట పట్టలేదు. మరోవైపు డీసీ చెలరేగిపోతోంది. రెండోసారి తలపడుతున్న వీరిలో నేడు గెలిచేదెవరు? తుది జట్లలో ఎవరుంటారు?


x




పైన పటారం!


చూస్తేనేమో జట్టు నిండా స్టార్లే! ఇంటర్నేషనల్‌ వేదికలపై చెలరేగిన అమ్మాయిలే! ఏం జరిగిందో ఏంటో! ముంబయి పిచ్‌లపై మాత్రం వ్యూహాలు అమలు చేయలేక ఇబ్బంది పడుతోంది ఆర్సీబీ (RCB Women). నాయకత్వం నుంచి అన్ని విభాగాల్లోనూ ఆ జట్టుది వెనకంజే! ఇప్పటికే సగం సీజన్‌ ముగిసింది. నాలుగు మ్యాచులాడినా ఒక్కటీ గెలవలేదు. కనీసం నేడైనా విజయం సాధించాలని స్మృతి మంధాన (Smriti Mandhana) బృందం తహతహలాడుతోంది. పవర్‌ప్లే వరకు బాగానే 8.5 వరకు రన్‌రేట్‌ మెయింటేన్‌ చేస్తున్నా మిడిలార్డర్‌ కుదురుకోవడం లేదు. స్మృతి మంధాన ఒక్క మ్యాచులోనూ తనదైన శైలిలో విరుచుకుపడలేదు. పైగా స్పిన్నర్ల బౌలింగ్‌లో ఔటవుతోంది. సోఫీ డివైన్‌ టచ్‌లోకి వచ్చింది. ఎలిస్ పెర్రీ ఫర్వాలేదు. హీథర్‌నైట్‌కు మిగతావాళ్ల అండ దొరకడం లేదు. రిచా ఘోష్‌, కనికా అహుజా స్థాయికి తగ్గట్టు ఆడలేదు. శ్రేయాంక మాత్రం మంచి ఇంటెన్సిటీతో ఆశలు రేపుతోంది. బౌలింగ్‌లో ఒక్కరంటే ఒక్కరూ జట్టును ఆదుకోవడం లేదు. వికెట్లు తీయడం లేదు. అయితే టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో జట్టు ఆర్సీబీ కావడం విశేషం.




కాంబినేషన్‌ అదిరింది!


దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) నాలుగో విజయానికి సిద్ధమైనట్టే! ప్రస్తుతం ఆ జట్టులోని క్రికెటర్లంతా రెడ్‌ హాట్‌ ఫామ్‌లో ఉన్నారు. ముంబయి మ్యాచులో బోల్తా పడ్డారు కానీ మిగతా అందరి పైనా వారిదే పైచేయి! కెప్టెన్‌ మెగ్‌లానింగ్‌ (Meg Lanning), షెఫాలీ వర్మ (Shafali Verma) రెచ్చిపోతున్నారు. రోడ్రిగ్స్‌, మారిజానె కాప్‌ దూకుడు కొనసాగిస్తున్నారు. లారా హ్యారిస్‌, జెస్‌ జొనాసెన్‌ సంగతి తెలిసిందే. విమెన్‌ బిగ్‌బాష్‌లో లారా హ్యారిస్‌ 83 ఇన్నింగ్సుల్లో 157.01 స్ట్రైక్‌రేట్‌తో ఆడటం గమనార్హం. మిన్ను మణి రావడంతో కుషన్‌ పెరిగింది. టారా నోరిస్‌, రాధా యాదవ్‌, శిఖా పాండే, జొనాసెన్‌, కాప్‌ బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నారు.ఈ సీజన్లో ఎక్కువ సిక్సర్లు 22 కొట్టిన జట్టు డీసీనే. 


తుది జట్లు (అంచనా)


దిల్లీ క్యాపిటల్స్‌: మెగ్‌ లానింగ్‌, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, మారిజానె కాప్‌, లారా హ్యారిస్‌, జెస్‌ జొనాసెన్‌, మిన్ను మణి, తానియా భాటియా, శిఖా పాండే, రాధా యాదవ్‌, టారా నోరిస్‌


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్‌, ఎలిస్‌ పెర్రీ, హీథర్‌ నైట్‌, ఎరిన్‌ బర్న్‌ / నీకెర్క్‌, రిచా ఘోష్, కనికా అహుజా, శ్రేయాంక పాటిల్‌, రేణుకా సింగ్‌, కోమల్‌ జంజాడ్‌, సహనా పవార్‌