టీమిండియాకు గాయాల బెడద వేధిస్తోంది.  ఇప్పటికే  జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లు జట్టుకు దూరమైన వేళ ఇప్పుడు మరో కీలక ఆటగాడికి కూడా  సర్జరీ తప్పేట్లు లేదు. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు  కొంతకాలంగా వేధిస్తున్న వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతడు  భారత్ - ఆస్ట్రేలియా నడుమ  అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో  తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాలేదు. ప్రస్తుతం అతడి పరిస్థితి చూస్తే త్వరలో మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  2023 సీజన్ లో ఆడబోయేది కూడా అనుమానంగానే ఉంది. 


అహ్మదాబాద్ టెస్టులో అయ్యర్‌కు వెన్నునొప్పి తిరగబెట్టడంతో  ఆట మూడో రోజే  బీసీసీఐ అతడిని వైద్య పరీక్షలకు పంపింది.  దీంతో  గిల్ ఔటయ్యాక  ఐదో స్థానంలో అయ్యర్ రావాల్సి ఉండగా  రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత భరత్, అక్షర్, అశ్విన్ లు రావడంతో   అయ్యర్ గాయం విషయం  వెలుగులోకి వచ్చింది.  


హడావిడిగా తీసుకొచ్చారా..? 


శ్రేయాస్‌కు గాయలేమీ కొత్తకాదు.  ఈ ఏడాది ఆరంభంలోనే గాయం కారణంగా  శ్రీలంక, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ లకు దూరమైన అతడు.. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ టెస్టులో కూడా ఆడలేదు.  ఆ తర్వాత ఢిల్లీ టెస్టులో హడావిడిగా అతడిని రప్పించి ఆడించినా   పెద్దగా రాణించలేదు.  ఢిల్లీ టెస్టుకు ముందు అయ్యర్ ఇంకా కోలుకోలేదని.. అతడు  ఇండోర్ టెస్టులో కూడా ఆడేది అనుమానమే అని నివేదికలు వచ్చినా  బీసీసీఐ అతడిని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నుంచి ఆగమేఘాల మీద రప్పించి రెండో టెస్టు ఆడించింది.  పూర్తి ఫిట్నెస్ సాధించకున్నా ఆడించి మరోసారి చేతులు కాల్చుకుంది బీసీసీఐ.. 


బుమ్రా ఎపిసోడ్ రిపీట్ కావాల్సిందేనా..? 


గాయాలను దాచి పూర్తి ఫిట్నెస్ సాధించకున్నా ఆటగాళ్లను ఆడించి  విమర్శల పాలవుతున్న బీసీసీఐ గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. బుమ్రా విషయంలో జరిగిందిదే. గతేడాది ఆసియా కప్ కు ముందు బుమ్రా గాయపడ్డాడు. అతడికి ఆరు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. కానీ బీసీసీఐ మాత్రం బుమ్రాను సెప్టెంబర్ లో ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఎంపిక చేసి ఓ  మ్యాచ్ కూడా ఆడించింది. ఫలితంగా గాయం తిరగబెట్టడంతో బుమ్రా.. కీలకమైన టీ20 ప్రపంచకప్ తో పాటు  పలు టోర్నీలకు దూరమయ్యాడు.  ఇక ఈ ఏడాది శ్రీలంకతో సిరీస్ లో కూడా అంతే. వన్డే సిరీస్ కు అతడిని ఎంపిక చేసి ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే మళ్లీ  గాయం పేరు చెప్పి  ఎన్సీఏకి పంపింది. ఎన్సీఏలో వైద్యులు బుమ్రాకు స్కానింగ్ చేసి శస్త్రచికిత్స అవసరమని తేల్చడంతో ఆలస్యంగా మేలుకున్న బీసీసీఐ.. ఇటీవలే అతడిని న్యూజిలాండ్ కు పంపి అక్కడ సర్జరీ చేయించింది.


గాయాలను దాచి, పూర్తి ఫిట్నెస్ సాధించకముందే ఆడించినందుకు గాను  బీసీసీఐ బుమ్రా విషయంలో  భారీ మూల్యమే చెల్లించుకుంది.  ఇప్పుడు  బుమ్రా ఆరు నెలల పాటు విరామం తీసుకోవాల్సి ఉంది. ఈ ఏడాది అసలే వన్డే వరల్డ్ కప్ ఉండటంతో  అప్పటివరకైనా ఫిట్నెస్ సాధిస్తాడా..? లేదా..? అన్నది అనుమానమే. మరి ఇప్పుడు అయ్యర్ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా..?   


వన్డే సిరీస్ తో పాటు ఐపీఎల్‌ కూడా డౌటే..? 


అయ్యర్ గాయానికి కూడా శస్ర్తచికిత్స తప్పదని తేలితే అది భారత్ కు మరో షాకింగ్ న్యూసే.  ప్రస్తుత నివేదికల ప్రకారం అయితే  అయ్యర్  త్వరలో  ప్రారంభమయ్యే (మార్చి 17 నుంచి) వన్డే సిరీస్ లో ఆడటం  కష్టమే. ఈ మాసాంతం నుంచి మొదలయ్యే ఐపీఎల్ సీజన్  కు కూడా అతడు  ఆడేది అనుమానమే. ఇదే జరిగితే కేకేఆర్‌ రెగ్యులర్ కెప్టెన్ లేకుండానే బరిలోకి దిగనుంది...!