ఇప్పుడు 'నాటు నాటు...'  సాంగ్ (Naatu Naatu Won Oscar) గురించి తెలియని ప్రపంచ సినిమా ప్రేక్షకుడు ఉండరేమో!? ఆస్కార్ వేదికగా ప్రపంచం నలు దిక్కులకూ మన పాట చేరింది. ఆస్కార్ అవార్డ్స్ కంటే ముందు 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా (RRR Movie), 'నాటు నాటు...' పాట కోట్లాది ప్రేక్షకుల చెంతకు చేరాయి. ఇప్పుడు ఆస్కార్ రావడంతో తెలియని వారు ఎవరైనా ఉంటే... వాళ్ళకూ తెలిసింది. అయితే.... ఆస్కార్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ (Jimmy Kimmel)కి 'నాటు నాటు...' గురించి పూర్తిగా తెలియకపోవడం శోచనీయమని తెలుగు ప్రేక్షకులు అంటున్నారు.


'నాటు నాటు...'తో ఆస్కార్ ఆరంభం
'నాటు నాటు...'కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు రావడమే కాదు... మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ స్టేజి మీద యంగ్ సింగర్స్ కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడమే కాదు... ఇంకో అరుదైన ఘనత 'ఆర్ఆర్ఆర్' సాధించింది. ఈ ఏడాది... 95వ అకాడమీ అవార్డ్స్ ప్రారంభమే 'నాటు నాటు...' పాటతో మొదలైంది.


జిమ్మీ... అది తెలుగు 'నాటు'
అమెరికన్ టీవీ సెలబ్రిటీ, హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యానంతో ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. జిమ్మీ చెబుతున్న సమయంలో కొంత మంది డ్యాన్సర్లు వచ్చి 'నాటు నాటు...' స్టెప్పులు వేశారు. ఆ సమయంలో జిమ్మీ బాలీవుడ్ సాంగ్ అంటూ చెప్పారు. అది తెలుగు అభిమానులకు నచ్చలేదు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ కాదని, ఇంకా వేరే భాషలు కూడా ఉన్నాయని నెటిజనులు ఫైర్ అవుతున్నారు. అదీ సంగతి!


తెలుగులో పాడిన పాట...
దీపిక భలే చెప్పిందిగా!
'ఆర్ఆర్ఆర్' సినిమా, 'నాటు నాటు...' సాంగ్ గురించి దీపికా పదుకోన్ ఇచ్చిన ఇంట్రడక్షన్ భారతీయుల హృదయాలను గెలుచుకుందని చెప్పవచ్చు. అలాగే, తెలుగు ప్రేక్షకుల మనసు కూడా! 'నాటు నాటు...' బాలీవుడ్ సాంగ్ అని దీపికా పదుకోన్ చెప్పలేదు. భారతీయ స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ కథతో రూపొందిన సినిమా 'ఆర్ఆర్ఆర్' అనీ, తెలుగులో 'నాటు నాటు...' పాడారని ఆమె తెలిపారు. ఒకవేళ మీకు 'నాటు నాటు...' తెలియకపోతే ఇప్పుడు తెలుస్తుందని ఆమె చెప్పారు. 


'నాటు నాటు...'కు స్టాండింగ్ ఒవేషన్! 
ఆస్కార్స్ స్టేజి మీద కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడటం ఒక ఎత్తు అయితే... వాళ్ళ పెర్ఫార్మన్స్ కంప్లీట్ అయ్యాక ఆడిటోరియంలో ఉన్న ప్రముఖులు అంతా నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. ఒక రెండు నిమిషాలు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. తెలుగు పాటకు, భారతీయ పాటకు దక్కిన గౌరవంగా దీనిని మనం చూడాలి. రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)ను రాజమౌళి గ్రీట్ చేశారు.


Also Read : ఆస్కార్ గొడవ - ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఎందుకు, రామ్ చరణ్ ఎక్కడ? మెగా ఫ్యాన్స్ ఫైర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'ను డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జంటగా ఆలియా భట్ నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 'నాటు నాటు' పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు.


Also Read : ఎన్టీఆర్ షేర్వాణీపై పులి బొమ్మ వెనుక సీక్రెట్ - 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్‌పై కామెంట్