స్వదేశంలో బంగ్లాదేశ్ సంచనాలు  నమోదు చేస్తున్నది. వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను వణికించిన ఆ జట్టు.. టీ20 సిరీస్ లో ఏకంగా ప్రపంచ ఛాంపియన్లను ఓడించింది.  బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించిన ఆ జట్టు.. ఇంగ్లాండ్‌కు షాకులిచ్చింది. మూడు మ్యాచ్‌ల  టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో గెలుచుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో  ఇంగ్లాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. గతేడాది డిసెంబర్‌లో భారత జట్టును ఓడించిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఏకంగా ఇంగ్లాండ్‌ను ఓడించి తాము ఏ జట్టునైనా ఓడించగలమని చెప్పకనే చెప్పింది.  


ఢాకా వేదికగా  ఆదివారం ముగిసిన  రెండో టీ20లో  బంగ్లాదేశ్..  తొలుత టాస్ గెలిచి   నిర్ణీత  20 ఓవర్లలో  ఇంగ్లాండ్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో  ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ తో వన్డే సిరీస్ లో  రాణించిన మెహదీ హసన్..  నాలుగు ఓవర్లు వేసి 12 పరుగులే ఇచ్చి  నాలుగు వికెట్లు తీయడమే గాక బ్యాట్ తో కూడా కీలక పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర  పోషించాడు.  


ఇంగ్లాండ్‌ బ్యా టర్లు విఫలం.. 


టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్‌కు రెండో  ఓవర్లేనే బంగ్లాదేశ్ షాకిచ్చింది.  ఓపెనర్ డేవిడ్ మలన్ (2)ను టస్కిన్ అహ్మద్ ఔట్ చేశాడు. మోయిన్ అలీ (15)తో పాటు కెప్టెన్ జోస్ బట్లర్ (4),  సామ్ కరన్ (12) కూడా విఫలమయ్యారు.   ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (25), బెన్ డకెట్ (28) ఫర్వాలేదనిపించారు. ఇక ఇంగ్లాండ్ లోయరార్డర్ కూడా  విఫలమవడంతో  ఇంగ్లాండ్ 120 పరుగుల మార్కును కూడా చేరలేదు. మోయిన్ అలీతో  పాటు సామ్ కరన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్ వికెట్లు కూడా మెహదీ హసన్‌కే దక్కాయి. 


బంగ్లాను ఆదుకున్న శాంతో.. 


స్వల్ప లక్ష్య ఛేదనలో  బంగ్లాదేశ్  కూడా ఓపెనర్లను వెంటవెంటనే కోల్పోయింది.  లిటన్ దాస్ (9), రానీ తాలూక్దార్ (9) ల విఫలమయ్యారు.  కానీ వన్ డౌన్ లో వచ్చిన నజ్ముల్ హోసేన్ శాంతో (47 బంతుల్లో 46, 3 ఫోర్లు) నిలకడగా ఆడాడు. అతడికి హృదయ్ (17), మోహదీ హసన్ (20) లు అండగా నిలిచారు. 


సిరీస్ కైవసం.. 


రెండో టీ20లో విజయంతో  బంగ్లాదేశ్  మరో మ్యాచ్ మిగిలుండగానే  సిరీస్ ను సొంతం చేసుకుంది.  వన్డే సిరీస్ లో కూడా బంగ్లాదేశ్.. తొలి మ్యాచ్ లో గెలిచినంత పని చేసింది.  మూడో మ్యాచ్ లో గెలిచింది. వన్డే సిరీస్ పోయినా పట్టుదలతో ఆడిన బంగ్లా.. ఇప్పుడు టీ20 సిరీస్ ను సాధించడం విశేషం. ఈ సిరీస్ లో  భాగంగా తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్.. ఆరు వికెట్ల తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే.  సిరీస్ లో నామమాత్రమైన మూడో  మ్యాచ్.. ఈనెల 14న ఇదే వేదికగా జరుగుతున్నది. టీ20 ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించిన తర్వాత జోస్ బట్లర్ సేనకు ఇది ఘోర అవమానకర ఓటమి కావడం గమనార్హం. టెస్టులలో  బెన్ స్టోక్స్ సేన  విదేశీ గడ్డల మీద  సంచలన విజయాలు నమోదుచేస్తుంటే  బట్లర్ గ్యాంగ్ మాత్రం ఇంకా క్రికెట్ లో పసికూన ముద్ర వేసుకునే ఉన్న బంగ్లా చేతిలో ఓడటం ఆ జట్టు అభిమానులను జీర్ణించలేకపోతున్నారు.