Abdul Sattar on Farmers:


కొత్తేం కాదు..


మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ రైతులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కొత్త సమస్యేమీ కాదని, ఏటా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అన్నారు. ఔరంగాబాద్ జిల్లాలోని సిల్లోడ్ నియోజకవర్గంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అబ్దుల్‌ను మీడియా ప్రశ్నించింది. అందుకు సమాధానంగా ఇవేం కొత్త కాదుగా అని బదులిచ్చారు. 


"రైతులు ఆత్మహత్య చేసుకోవడం అనేదేమీ కొత్త కాదు. ఎన్నో ఏళ్లుగా ఇవి జరుగుతూనే ఉన్నాయి. నా నియోజవర్గంలోనే కాదు, మహారాష్ట్రలో ఎక్కడా ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నాను"


- అబ్దుల్ సత్తార్, మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి 


సిల్లోడ్ నియోజకవర్గంలో మార్చి 3-12 మధ్యలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే సమయంలో ఔరంగాబాద్‌ జిల్లాలోనే మరఠ్వాడా ప్రాంతంలో ఆరుగురు రైతులు బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే...ఈ ఆత్మహత్యలపై విచారణ జరింపేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి అబ్దుల్ సత్తార్ వెల్లడించారు. గత వారం అకాలంగా కురిసిన వర్షాలకు చాలా మంది రైతులకు పంటనష్టం జరిగింది. వీటిని పరిశీలించిన మంత్రి...కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. 


"రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టింది. కేవలం ఒక్క రూపాయితోనే పంట బీమా కల్పిస్తున్నాం"


- అబ్దుల్ సత్తార్, మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి 


మార్చి 9న మహారాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో రూ.6 వేల మేర నగదు ప్రోత్సాహకాలతో పాటు రూ.1తోనే పంట బీమా కల్పించనున్నట్టు వెల్లడించింది.