Yes Bank: ఇవాళ మార్కెట్‌ ప్రారంభ నుంచే యెస్‌ బ్యాంక్‌ షేర్లు ఇవాళ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. మరికొన్ని వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. దీని వెనుక చాలా కీలక కారణం ఉంది.


శుక్రవారం (10 మార్చి 2023) ట్రేడింగ్‌లో 0.36% నష్టంతో రూ. 16.52 వద్ద ముగిసిన యెస్‌ బ్యాంక్‌ షేరు.. ఇవాళ, (సోమవారం, 13 మార్చి 2023) ఓపెనింగ్‌లోనే 7 శాతంపైగా నష్టంతో రూ. 14.60 వద్ద ప్రారంభమైంది. 


మూడేళ్ల కట్టడి నుంచి విముక్తి
యెస్‌ బ్యాంక్‌ షేర్లలో ఇతర వ్యక్తిగత ఇన్వెస్టర్లు, బ్యాంకులు పెట్టిన పెట్టుబడులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) విధించిన మూడేళ్ల లాక్‌-ఇన్‌ గడువు నేటితో ముగుస్తుంది. మూడేళ్ల క్రితం పీకల్లోతు కష్టాల్లో ఉన్న యెస్‌ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు, RBI ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా, స్టేట్‌ బ్యాంక్‌ సహా 9 బ్యాంకుల కన్సార్షియం 2020 మార్చిలో యెస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడలకు గాను యెస్‌ బ్యాంక్‌లో సుమారు 49 శాతం వాటా ఎస్‌బీఐ కన్సార్టియం చేతికి వచ్చింది. అప్పట్లో... ఒక్కో షేరును రూ. 10 చొప్పున 9 బ్యాంకుల కన్సార్టియం కొనుగోలు చేసింది. దీంతోపాటు, వ్యక్తిగత మదుపుదార్లు కూడా పెట్టుబడులు పెట్టారు. ఉద్దీపన ప్యాకేజీ కాబట్టి, ఆయా షేర్లకు మూడేళ్ల లాక్‌-ఇన్‌ పిరియడ్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ విధించింది.


ఈ రోజుతో లాక్‌-ఇన్‌ గడువు ముగుస్తుంది. దీంతో.. తమ వద్ద ఉన్న షేర్లను స్వేచ్ఛగా అమ్ముకోవడానికి 9 బ్యాంకుల కన్సార్షియం, వ్యక్తిగత మదుపుదార్లకు అవకాశం చిక్కింది. అంటే.. యెస్‌ బ్యాంక్‌లో సగం వాటా అమ్ముకోవడానికి అవకాశం వచ్చింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు, హై నెత్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (HNIs), NRIs వంటి వ్యక్తిగత పెట్టుబడిదార్ల వద్ద 135 కోట్ల యెస్‌ బ్యాంక్‌ షేర్లు ఉన్నాయి. 6.7 కోట్ల షేర్లు ETFs చేతిలో ఉన్నాయి. అయితే, ఒకేసారి మొత్తం వాటా విక్రయించడానికి సెబీ నిబంధనలు ఒప్పుకోవు. కాబట్టి.. బ్యాంకులు దఫదఫాలుగా వాటి షేర్లను మార్కెట్‌లో విక్రయానికి పెట్టే అవకాశం ఉంది. ఈ అమ్మకం ప్రక్రియ మరికొన్ని వారాల పాటు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్ల (ETFs) నుంచి యెస్‌ బ్యాంక్‌ షేర్లలో భారీ అమ్మకాలు కనిపించవచ్చుని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి, యెస్‌ బ్యాంక్‌ షేర్లను మరికొన్ని రోజుల పాటు పెట్టుబడిదార్లు జాగ్రత్తగా గమనిస్తూ, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.


బ్యాంకుల వద్ద 1,130 కోట్ల షేర్లు
స్టేట్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని కన్సార్టియంలో... HDFC, HDFC బ్యాంక్‌, ICICI బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌, IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ ఉన్నాయి. 


2022 డిసెంబర్‌ త్రైమాసికం ముగింపు నాటికి, స్టేట్‌ బ్యాంక్‌ పోర్ట్‌ఫోలియోలో‌605 కోట్ల షేర్లు యెస్‌ బ్యాంక్‌ షేర్లు లేదా 26.14 శాతం స్టేక్‌ ఉంది. HDFC, HDFC బ్యాంక్‌, ICICI బ్యాంక్‌ తలో 100 కోట్ల యెస్‌ షేర్లు కొన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ చేతిలో 60 కోట్ల షేర్లు ఉండగా, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ వద్ద 50 కోట్ల షేర్లు జమ అయ్యాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌ వద్ద తలో 30 కోట్ల షేర్లు, IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ వద్ద 25 కోట్ల షేర్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే, ఈ కన్సార్టియం వద్ద 1,130 కోట్ల షేర్లు ఉన్నాయి, ఇది యెస్‌ బ్యాంక్‌లో 49 శాతం వాటాకు సమానం. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.