ఆస్కార్ అవార్డుల్లో ఇండియా బోణీ కొట్టింది. ఇండియన్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 'ద ఎలిఫెంట్ విష్పరర్స్'కు అవార్డు వచ్చింది. కార్తీక గొంజాల్వేస్ దర్శకత్వంలో గునీత్ మోంగా నిర్మించిన చిత్రమిది. దాంతో ఇండియన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
ద అకాడమీ అవార్డ్స్... 95వ ఆస్కార్ పురస్కారాల్లో డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 'ద ఎలిఫెంట్ విష్పరర్స్'తో పాటు డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 'ఆల్ దట్ బ్రీత్స్' కూడా నిలిచింది. 'ద ఎలిఫెంట్ విష్పరర్స్'కు అవార్డు వచ్చింది.
Also Read : ఆస్కార్స్‌లో 'ఆర్ఆర్ఆర్' టీమ్ - భారతీయ సంస్కృతి కనిపించేలా...
'ద ఎలిఫెంట్ విష్పరర్స్' విషయానికి వస్తే... రెండు పిల్ల ఏనుగుల కథే ఈ డాక్యుమెంటరీ. 'గున్న ఏనుగులు' అంటారు కదా... అటువంటివి అన్నమాట. ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఆ ఏనుగు పిల్లలకు తమిళనాడు అటవీ శాఖ తప్పెకాడు ఎలిఫ్యాంట్ క్యాంపులో పునరావాసం కల్పిస్తోంది. గత 140 ఏళ్లుగా అక్కడి అటవీశాఖ ఇటువంటి పని చేస్తోంది. తల్లి నుంచి వేరుపడిపోయిన ఏనుగులు పరిసర గ్రామల మీద పడి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా... అవి బెం గపెట్టుకుని చనిపోకుండా కాడు నాయగన్ అనే ఓ గిరిజన తెగకు వాటిని అప్పగిస్తూ ఉంటారు.
'కాడు నాయగన్' తెగ అడవి జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంది. అటవీ జంతువులు, ఏనుగు పిల్లలను పెంచడంలో ఆ తెగకు తరతరాల వారసత్వం ఉంది. అలా బొమ్మన్, బెల్లీ అనే దంపతులకు రఘు, అమ్ము అనే చిన్న ఏనుగులను పెంచే బాధ్యతను ఫారెస్ట్ ఆఫీసర్స్ అప్పగిస్తారు. వాటిని కుటుంబ సభ్యుల వలే ఎలా పెంచారు? ఆ చిన్న చిన్న ఏనుగు పిల్లలు చేసే చిలిపి పనులు, అల్లరి ఏంటి? బొమ్మన్, బెల్లీతో ఆ ఏనుగులు ఎటువంటి అనుబంధం పెంచుకున్నాయి? అనేది ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కథ.
'ద ఎలిఫెంట్ విష్పరర్స్' నిడివి 40 నిమిషాలు. ఇదొక విజువల్ వండర్. మనకు కథ ఎంత తెలిసినా... స్క్రీన్ మీద చూస్తుంటే వచ్చే అనుభూతి వేరు. ప్రకృతిని ఇంత అద్భుతంగా ఒడిసి పట్టొచ్చా? అడవితో ఇంత ఆప్యాయంగా మాట్లడవచ్చా? అని మనకు అనిపిస్తుంది. గిరిజన తెగలు అడవి జంతువులతో పెంచుకునే ఆప్యాయత మన మనసులను తాకుతుంది. అడవి జంతువుల దాడిలో వారసులు ప్రాణాలు కోల్పోయినా... అది అడవి నియమం అని అక్కడే బతుకుతారు తప్ప ఆ జంతువులు తమకు అవసరం లేదని మాత్రం అనుకోరు.
'ద ఎలిఫెంట్ విష్పరర్స్'లో అద్భుతమైన విషయం... దీని డైరెక్టర్ లేడీ. కార్తికీ గొన్ సాల్వేస్. ఆమె వయసు 37 సంవత్సరాలు. డాక్యుమెంటరీ కోసం ఆమె ఐదేళ్లు కష్టపడ్డారు. తన బృందంతో కలిసి ఐదేళ్ల పాటు ఏనుగులతో జీవించారు. ఇదంతా కథ కాదు నిజ జీవితంలో బొమ్మన్, బెల్లీలు చేసే పనిని ఐదేళ్ల పాటు అందంగా విజువలైజ్ చేశారు. 40 నిమిషాల డాక్యుమెంటరీలో ఆ కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ప్రత్యేకంగా స్వెన్ ఫాల్కనర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. చాలా సీన్లలో హార్ట్ మెల్ట్ అయిపోతుంది. డిసెంబర్ లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది.