ఆస్కార్ అవార్డుల వేడుకకు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ యావత్ సినీ ప్రపంచంలో ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకను చూడటానికి అందరూ ఎదురు చూస్తున్నారు. 95వ అకాడెమీ అవార్డుల వేడుకకు సర్వం సిద్దం చేస్తున్నారు నిర్వాహకులు. మార్చి 13న ఈ వేడుక అమెరికాలో జరగనుంది. దీంతో ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూల నుంచీ సినీ ప్రముఖులు హాజరవుతారు. అయితే ఈ ఆస్కార్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేది రెడ్ కార్పెట్. రెడ్ కార్పెట్ పై ఒక్కసారి నడిస్తే చాలని ఫీల్ అవుతుంటారు నటీనటులు. అంతటి ప్రాముఖ్యం ఉన్న రెడ్ కార్పెట్ కలర్ ను ఈసారి మార్చేశారు నిర్వాహకులు. దాని బదులు షాంపైన్ కలర్(ఇసుక రంగు) కార్పెట్ ను ఎంపిక చేశారు.
దాదాపు 63 ఏళ్ల తర్వాత ఇలా..
ఏ అవార్డుల వేడుకైనా రెడ్ కార్పెట్ కు ఒక ప్రాధాన్యత ఉంటుంది. అలాంటిది ఆస్కార్ అవార్డుల్లో ఉండే రెడ్ కార్పెట్ కు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో చెప్పనక్కర్లేదు. దాదాపు 62 ఏళ్ళ తర్వాత ఈ రెడ్ కార్పెట్ ను మార్చనున్నారు. దీంతో ఆ మూమెంట్ కోసం ప్రేక్షకులతో పాటు యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది. 1961 నుంచి అంటే 33వ అవార్డుల వేడుక నుంచీ కూడా రెడ్ కార్పెట్ ను వినియోగిస్తూ వస్తున్నారు. తొలిసారిగా ఇప్పుడు రెడ్ కార్పెట్ ను మార్చుతున్నారు. వాస్తవానికి ఈసారి అవార్డుల వేడుకను నిర్వహిస్తోన్న అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఎరుపు రంగుకు బదులు షాంపైన్ రంగును వినియోగించాలని నిర్ణయం తీసుకుంది.
ఆ చెంపదెబ్బలు ఉండవు: జిమ్మీ కిమ్మెల్
ఈ ఏడాది ఆస్కార్ వేడుకలకు హోస్ట్ గా అమెరికన్ కమెడియన్ జిమ్మీ కిమ్మెల్ వ్యవహరిస్తున్నాడు. ఈ రెడ్ కార్పెట్ కలర్ మార్పుపై ఆయన స్పందించారు. ‘‘గతేడాది కమెడియన్ క్రిస్ రాక్ ను నటుడు విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టడం వలన అకాడెమీ మొత్తం ఎరుపెక్కింది. అందుకే ఈ ఏడాది కలర్ మార్చే నిర్ణయం తీసుకున్నారు. ఈసారి అలాంటి చెంపదెబ్బలు ఉండవు అని చమత్కరించారు. గతేడాది ఆస్కార్ అవార్డుల వేడుకల్లో విల్ స్మిత్ భార్య హెల్త్ గురించి జోక్ వేయడంతో విల్ స్మిత్ ఆయనపై చేయిచేసుకున్న సంగతి తెలిసిందే.
ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’..
ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఇండియా నుంచి తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఉండటం విశేషం. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడమే కాకుండా పలు అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది. ఇక ఈ మూవీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది. ఈసారి అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమాలోని ఓ పాటను లైవ్ ప్రదర్శన చేయనున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ భారత ప్రజలు ఆ మధుర క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఇండియాలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ లో వీక్షించవచ్చు.
Read Also: ‘నాటు నాటు’ పాట ఆస్కార్ మాత్రమే కాదు, ఆ అవార్డు కూడా గెలవాలి: ఏఆర్ రెహమాన్