రికొద్ది గంటల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ  కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్ కు ఈసారి కచ్చితంగా  ఆస్కార్ అవార్డు దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. 'RRR’, 'ది ఎలిఫెంట్ విస్పరర్స్', 'ఆల్ దట్ బ్రీత్స్' ప్రతిష్టాత్మక అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అటు పలు కేటగిరీల్లో నామినేషన్ అందుకున్న 'ది ఎలిఫెంట్ విస్పరర్స్', 'ఆల్ దట్ బ్రీత్స్' కూడా ఆస్కార్ వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు సినీ ప్రముఖులు.

ఆస్కార్ కోసం 3 విభాగాల్లో పోటీ పడుతున్న భారతీయ చిత్రాలు

ఆస్కార్ నామినేషన్స్ లో భారత్ నుంచి ‘RRR’ ‘నాటు నాటు…’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్  విభాగంలో చోటు దక్కించుకోగా, మన దేశానికే చెందిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ మూవీ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్ విభాగంలో నామినేషన్ అందుకుంది. శౌనక్ సేన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అటు ముంబైకి చెందిన ప్రముఖ ఫోటోజర్నలిస్ట్ కార్తికీ గోన్సాల్వెస్ తెరకెక్కించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ మూవీ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ కేటగిరీలో నామినేషన్ పొందింది. తప్పకుండా ఈ మూడు కేటగిరీల్లోనూ మన సినిమాలు సక్సెస్ సాధించాలని సినీ అభిమానులు భావిస్తున్నారు. కచ్చితంగా ఒకటికి మించి ఆస్కార్ అవార్డులు వస్తాయని ఆశిస్తున్నారు. అయితే, ‘‘నాటు నాటు’’ పాటకు ‘బ్లాక్ పాంథర్’ సినిమాలో రిహానా ఆలపించిన ‘‘లిఫ్ట్ మీ అప్’’ సాంగ్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 

ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘‘నాటు నాటు’’తో పోటీ పడుతున్న పాటలివే

  పాట ఏ సినిమాలోనిది?
1 నాటు నాటు  ఆర్‌ఆర్‌ఆర్‌
2 అప్లాజ్‌  టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌
3 హోల్డ్‌ మై హ్యాండ్‌   టాప్‌గన్‌: మార్వెరిక్‌
4 లిఫ్ట్‌ మీ అప్‌  బ్లాక్‌ పాంథర్‌
5 ది ఈజ్‌ ఏ లైఫ్‌  ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

నామినేషన్ పొందినా ఆస్కార్ గెలవని ‘రైటింగ్ విత్ ఫైర్’

ఇక గతంలో భారత్ కు చెందిన ‘రైటింగ్ విత్ ఫైర్’ అనే మూవీ సైతం డాక్యుమెంటరీ ఫీచర్ మూవీ  విభాగంలోనే నామినేషన్ అందుకుంది. అయితే, ఆస్కార్ అవార్డును మాత్రం గెలవలేకపోయింది. ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో కచ్చితంగా ఈ చిత్రాలు ఆస్కార్ ను అందుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఒకేసారి మూడు చిత్రాలను ఆస్కార్ కు నామినేట్ కావడం ఇదే తొలిసారి.  

ఆస్కార్ అవార్డును అందించే అవకాశాన్ని పొందిన దీపికా పదుకొణె

 ఇక నామినేషన్లతో పాటు బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె స్టార్-స్టడెడ్ వేడుకలో ఒక అవార్డును అందజేసే అవకాశాన్ని పొందింది. ఆస్కార్ వేదికపై గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, సంగీత స్వరకర్త MM కీరవాణి కలిసి ‘నాటు నాటు’ పాటను పాడనున్నారు. ఇక ఇప్పటికే భారత్ నుంచి ప్రముఖ సినీ కళాకారులను అకాడమీ సంస్థ ఓటింగ్ కు ఆహ్వానించింది.  ప్రపంచ వ్యాప్తంగా 9 వేలకు పైగా సభ్యులు ఆస్కార్ కోసం ఓటు వేశారు.  ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక అవార్డుల వేడుక సోమవారం (భారతకాలమానం ప్రకారం) ఉదయం 6:30 నుంచి డిస్నీ+ హాట్‌ స్టార్‌లో ప్రసారం కానుంది. హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక జరుగుతుంది. 

Read Also: ‘నాటు నాటు’ పాట ఆస్కార్ మాత్రమే కాదు, ఆ అవార్డు కూడా గెలవాలి: ఏఆర్ రెహమాన్