నందమూరి బాలకృష్ణ 'ఆహా' ఓటీటీ ద్వారా ప్రేక్షకులని మరోసారి అలరించబోతున్నారు. ఈ ‘అన్ స్టాపబుల్‌’ హోస్ట్‌ గతంలో ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’ కార్యక్రమానికి హాజరయిన విషయం తెల్సిందే. ఆ ఎపిసోడ్‌ కు మంచి స్పందన లభించింది. కంటెస్టెంట్స్ తో ఆయన సాగించిన ముచ్చట్లు అప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆహా ఓటీటీలో ప్రస్తుతం ఈ షో సీజన్ 2 కొనసాగుతున్న విషయం తెల్సిందే. సీజన్‌ 1 లో మాదిరిగానే సీజన్ లో కూడా బాలయ్య గెస్ట్‌ గా హాజరయ్యి ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి షో ల్లో ఆయన చేస్తున్న సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అన్ స్టాపబుల్’ షోతో బాలయ్య తనలోని కొత్త యాంగిల్ ను ప్రేక్షకులకు చూపించడమే కాకుండా అప్పుడప్పుడు ఇతర షో ల్లో ఇలా  గెస్ట్‌ గా కూడా సందడి చేస్తున్నారు. థమన్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ షో కి న్యాయ నిర్ణేతలు, మెంటర్స్ గా వ్యవహరిస్తున్న కారణంగా ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. 
 
‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’ గత సీజన్ లోని బాలయ్య ఎపిసోడ్‌ కు ఏమాత్రం తగ్గకుండా ఈసారి కూడా షో నిర్వాహకులు ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రేక్షకులు కచ్చితంగా ఆహా అనే విధంగా ఈ ప్రత్యేక ఎపిసోడ్‌ ఉంటుందంటూ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. షో లో బాలయ్య కనిపించబోతున్నాడంటూ విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆడిషన్స్ లో పాల్గొంటే 12 మందిని జడ్జ్ లు ఎంపిక చేశారు. ఆ 12 మంది కంటెస్టెంట్స్ ను గాలా నైట్ లో బాలకృష్ణ పరిచయం చేయబోతున్నట్లుగా ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ప్రతి శుక్ర, శని వారాల్లో రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. బాలయ్య స్పెషల్ ఎపిసోడ్స్ ను మార్చి 17, 18వ తేదీల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘అన్‌ స్టాపబుల్‌’ టాక్ షోతో ఆహా ఓటీటీతో ఏర్పడిన అనుబంధం కారణంగా బాలయ్య ‘తెలుగు ఇండియన్ ఐడల్’ కార్యక్రమానికి మరోసారి హాజరవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.  


శరవేగంగా NBK108


‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలతో వరుస సక్సెస్‌ లను సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. కాజల్ అగర్వాల్‌ ఈ సినిమాలో నటింపజేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల షూటింగ్ లో శ్రీలీల పాల్గొన్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. బాలకృష్ణ కు ఆమె కూతురు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరితో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నాయట. వీరి మధ్య వచ్చే సెంటిమెంట్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయంటున్నారు. ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అతి త్వరలోనే చిత్ర టైటిల్ ను ప్రకటించడంతో పాటు విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.


Read Also: ‘నాటు నాటు’ పాట ఆస్కార్ మాత్రమే కాదు, ఆ అవార్డు కూడా గెలవాలి: ఏఆర్ రెహమాన్