యావత్ భారతదేశం ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన రోజు వచ్చేసింది. 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో ‘‘నాటు నాటు..’’ పాటకు ఆస్కార్ లభించింది. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా, తొలి భారతీయ సినిమా పాటగా ‘‘నాటు నాటు’’ చరిత్ర సృష్టించింది. మన దేశానికి వచ్చిన తొలి ఆస్కార్ అవార్డు ఇదే. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు ‘ఆర్ఆర్ఆర్’ టీం సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇది యావత్ భారతీయుల విజయమని రామ్ చరణ్ కొనియాడారు.
“ఎట్టకేలకు మేం సాధించాం. ఎంఎం కీరవాణి, జక్కన రాజమౌళి, పాటల రచయిత చంద్రబోస్ తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ టీం, దేశం మొత్తానికి కంగ్రాట్స్” అంటూ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుని పట్టుకుని ఉన్న ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
“మేం గెలిచాం.. ఇండియన్ సినిమాగా గెలిచాం.. దేశంగా గెలిచాం.. ఆస్కార్ అవార్డ్ ఇంటికి వస్తోంది” అని చెర్రీ ట్వీట్ చేశారు. “మన జీవితాల్లో, ఇండియన్ సినిమా చరిత్రలోనే ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేకమైన స్థానం. ఆస్కార్ లభించినందుకు ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. నాకు ఇదంతా నిజంగా కలలాగే ఉంది. అన్ స్టాపబుల్ ప్రేమ చూపించిన అందరికీ థాంక్యూ. సినిమా ఇండస్ట్రీలోనే రాజమౌళి, ఎంఎం కీరవాణి ఆణిముత్యాలు. ఈ ఘనత సాధించడంలో మమ్మల్ని భాగస్వాములుగా చేసినందుకు మీ ఇద్దరికీ థాంక్యూ. ‘నాటు నాటు..’ ఎమోషన్ ప్రపంచమంతా ఉంది. రచయిత చంద్రబోస్, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల బైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అందరికీ థాంక్స్. నా కో స్టార్ తారక్.. నీతో కలిసి మళ్ళీ డాన్స్ చేసి మరికొన్ని సరికొత్త రికార్డులు సృష్టించాలి. స్వీటెస్ట్ కో స్టార్ అలియా భట్ కి థాంక్స్. ఈ అవార్డు ప్రతి ఇండియన్ యాక్టర్, టెక్నీషియన్, సినిమాకి సొంతం. ఇంతటి ప్రేమ కురిపించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది దేశం విజయం” అని రామ్ చరణ్ అందరీకి పేరు పేరునా స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఆస్కార్ వేదికపై బెస్ట్ ఒరిజనల్ సాంగ్ గా ‘‘నాటు నాటు’’ను ప్రకటించిన వీడియో కూడా రామ్ చరణ్ ట్యాగ్ చేశారు.
Also Read : 'నాటు నాటు'కు ఆస్కార్ - సరికొత్త చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'