IND vs AUS, 4th Test Highlights:
అహ్మదాబాద్ టెస్టు చివరికి డ్రాగా ముగిసింది. ఐదోరోజు, సోమవారం 3/0తో ఆట మొదలు పెట్టిన ఆస్ట్రేలియా మూడు సెషన్లూ ఆడేసింది. 78.1 ఓవర్లకు 175/2తో నిలిచింది. మార్నస్ లబుషేన్ (63; 213 బంతుల్లో 7x4), స్టీవ్ స్మిత్ (10; 59 బంతుల్లో 2x4) అజేయంగా నిలిచారు. ఎలాగూ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు ముందుగానే మాట్లాడుకొని కరచాలనం చేసుకున్నారు. ఇందుకు అంపైర్లు అంగీకరించారు. దాంతో టీమ్‌ఇండియా ఈ సిరీసును 2-1 తేడాతో గెలిచింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. మరికొన్ని రోజుల్లోనే టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా (Team India vs Australia) ఇంగ్లాండ్‌లో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (World Test Championship) ఫైనల్లో తలపడనున్నాయి.
ట్రావిస్ హెడ్ - లబుషేన్ పాట్నర్‌షిప్
ఐదో రోజు, సోమవారం 3/0తో ఆట మొదలు పెట్టిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 14 వద్దే నైట్‌వాచ్‌మన్ మాథ్యూ కునెమన్ (6; 35 బంతుల్లో 1x4) వికెట్ చేజార్చుకుంది. అశ్విన్ వేసిన బంతికి అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత ఆసీస్ తిరుగులేకుండా ఆడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (90; 163 బంతుల్లో 10x4, 2x6), మార్నస్ లబుషేన్ నిలకడగా ఆడారు. చక్కని బంతుల్ని గౌరవిస్తూనే చెత్త బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించారు. దాంతో 73/1తో ఆసీస్ లంచ్‌కు వెళ్లింది.
ఎంత ట్రై చేసినా వికెట్లు పడలేదు
క్రీజులోకి తిరిగి రాగానే హెడ్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇందుకోసం 112 బంతులు తీసుకున్నాడు. మరోవైపు లబుషేన్ సైతం మెరుగ్గా ఆడటంతో ఈ జోడీ రెండో వికెట్‌కు 139 (292 బంతుల్లో) భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. 59.1వ బంతిని అక్షర్ ఆఫ్‌సైడ్ నెర్రలపై వేశాడు. హెడ్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించగా అతడి బ్యాటు అంచుకు తగిలిన బంతి నేరుగా ఆఫ్ వికెట్‌ను తాకేసింది. అప్పటికి స్కోరు 152. లబుషేన్ 150 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకోగానే 158/2తో ఆసీస్ టీ బ్రేక్ తీసుకుంది. స్టీవ్‌స్మిత్ పరుగులు చేయనప్పటికీ బంతులు ఆడేశాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి టీమ్‌ఇండియాను ఆలౌట్ చేద్దామన్న యోచన ఆసీస్ బృందంలో కనిపించలేదు. దాంతో గంట ముందే రెండు జట్ల కెప్టెన్లు మాట్లాడుకొని మ్యాచ్‌ను ముగించారు. ఆటగాళ్లంతా చిరునవ్వులు చిందిస్తూ మైదానం వీడారు.