ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లదంటే వెళ్లదని తెగేసి చెప్పినా గత కొంతకాలంగా  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడితో పాటు  మాజీ క్రికెటర్లు నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ  ఈ ఇష్యూను  నిత్యం రగుల్చుతూనే ఉన్నారు. తాజాగా పీసీబీ చీఫ్ నజమ్ సేథీ మరోసారి ఆసియా కప్ నిర్వహణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోని  అగ్రశ్రేణి జట్లు పాకిస్తాన్ కు వచ్చి క్రికెట్ ఆడుతుంటే.. భారత్‌కు మాత్రమే భద్రతా సమస్యలు ఎందుకు కనబడుతున్నాయని ప్రశ్నించాడు. 


భారత్‌కు ఎందుకంత భయం..?


ఆసియా కప్ నిర్వహణ వివాదం గురించి  సేథీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ... ‘క్రికెట్ ఆడేందుకు మిగతా జట్లు  పాకిస్తాన్ కు వస్తున్నాయి.  వాళ్లు భద్రత గురించి ఏ కంప్లయింట్లూ చేయడం లేదు.  కానీ భారత్ మాత్రమే సెక్యూరిటీ రీజన్స్‌ను చూపుతున్నది..? ఇదే రీతిలో మేము కూడా  ఈ ఏడాది  వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు  భారత్‌కు వెళ్లబోమని చెప్పాం. వీటిని ఐసీసీ సమావేశం (ఈ నెల చివరి వారంలో జరుగనుంది) లో లేవనెత్తుతా... 


భారత్ వ్యవహరిస్తున్న వైఖరి (పాక్‌కు వెళ్లనని చెప్పడం)కి మేం  వ్యతిరేకం. ఎందుకంటే ఇదేదో ఒక్క ఆసియా కప్  కు సంబంధించిన విషయం కాదు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ తో పాటు 2025లో ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా  పాకిస్తాన్ లోనే జరుగనుంది. దానిని కూడా దృష్టిలో ఉంచుకుని చర్చలు జరపాలి..’ అని చెప్పాడు. అయితే భారత్.. ఆసియా కప్ ఆడేందుకు పాక్‌కు  రాకున్నా తాము వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకు వెళ్లాలని తమ  ప్రభుత్వం చెబితే వెళ్లాల్సిందేనని సేథీ వివరించాడు. 






నేపథ్యమిది.. 


గతేడాది టీ20 ప్రపంచకప్ కు ముందు బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ కామెంట్స్  చేయడంతో వివాదం రేగింది. తటస్థ వేదిక అయితేనే తాము ఆసియా కప్ ఆడతామని, అలా కాకుండా పాకిస్తాన్ లో అయితే ఆడబోమని జై షా తేల్చి  చెప్పాడు.  దీంతో  పీసీబీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.  అలా అయితే తాము కూడా  వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియా  వెళ్లమని హెచ్చరించింది. దానికి కౌంటర్ గా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ..  ‘వచ్చేవాళ్లు వస్తారు. రాని వాళ్ల గురించి మేం  పట్టించుకోం..’ అని   కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 


నజమ్ సేథీ కూడా గత నెలలో బహ్రెయిన్ లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి ఈ వివాదంపై  ఏదో ఒక పరిష్కారం దిశగా అడుగులు వేయాలని  సూచించాడు.  ఈ సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు జై షా తో పాటు బీసీసీఐ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అప్పుడు కూడా బీసీసీఐ తన నిర్ణయాన్ని కరాఖండీగా చెప్పేసింది. భారత్.. పాక్ కు వెళ్లే విషయంలో కేంద్ర  ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది.