MIW vs GGW:
విమెన్ ప్రీమియర్ లీగులో 12 మ్యాచ్ జరుగుతోంది. సీసీఐ మైదానం వేదికగా గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచులో గుజరాత్ కెప్టెన్ స్నేహ రాణా బౌలింగ్ ఎంచుకుంది. వాతావరణంలో కాస్త తేమ ఉందని, ఎక్కువగా గాలి వీస్తోందని ఆమె పేర్కొంది. ఇది పేసర్లకు ఉపయోగపడుతుందని వెల్లడించింది. జట్టులో రెండు మార్పులు చేశామంది. లారా, జార్జీయా స్థానాల్లో సోఫీ డంక్లీ, బెల్ వస్తున్నారని తెలిపింది.
'టాస్ గెలుస్తానని అనుకున్నా. తొలుత బ్యాటింగ్ చేయాలని భావించాం. టాస్ ఓడినా ఇప్పుడు మొదటే బ్యాటింగ్ చేయబోతున్నాం. గుజరాత్ మంచి జట్టు. మేం మా బలానికి తగినట్టు ఆడతాం. సానుకూలంగా ఉంటాం. మమ్మల్ని మేం నమ్మడమే మా విజయాల్లో కీలకం. జట్టులో మార్పులేమీ చేయడం లేదు' అని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది.
పిచ్ ఎలా ఉందంటే?
సీసీఐలో ఎక్కువ పరుగులు చేయొచ్చు. ఇప్పుడు స్పిన్‌కు మరింత అనుకూలిస్తోంది. ఇప్పటికే ఉపయోగిస్తుండటంతో నెమ్మదించొచ్చు. నేటి మ్యాచులో స్పిన్నర్లదే కీలక పాత్ర.
తుది జట్లు
ముంబయి ఇండియన్స్ : హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), నాట్ స్కీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కెర్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్
గుజరాత్ జెయింట్స్: సోఫీ డంక్లీ, మేఘన, హర్లీన్ డియోల్, యాష్లే గార్డ్‌నర్, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అనబెల్ సుథర్‌ల్యాండ్, రాణా, తనుజా కన్వార్, కిమ్ గార్త్, మాన్సీ జోషీ
ఎదురులేని ముంబయి
అరంగేట్రం సీజన్లో మొదటి మ్యాచులో తలపడ్డ రెండు జట్లు గుజరాత్, ముంబయి! ఈ మ్యాచ్ విజయం నుంచీ హర్మన్‌ప్రీత్ సేన తిరుగులేని విధంగా దూసుకెళ్తోంది. వారిని అడ్డుకొనే వాళ్లు కనిపించడం లేదు. ఒకరు కాకపోతే మరొకరు నిలబడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ, వ్యూహాలు ఇలా అన్ని విభాగాల్లో వారు పటిష్ఠంగా ఉన్నారు.
ఓపెనింగ్‌లో హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా దంచికొడుతున్నారు. పవర్‌ప్లేలో భారీ స్కోర్లు అందిస్తున్నారు. మిడిలార్డర్లో నాట్ సివర్, హర్మన్, అమెలియా కెర్‌కు ఎదురులేదు. అసలు లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగే రావడం లేదు. బౌలింగ్‌లోనూ అంతే! ఇస్సీ వాంగ్ తన స్వింగ్‌తో చుక్కలు చూపిస్తోంది. సివర్, జింతామని కలిత ఫర్వాలేదు. స్పిన్నర్ సైకా ఇషాకిని ఆడటమే కష్టంగా ఉంది. టాప్ వికెట్ టేకర్ ఆమే. అవసరమైతే హేలీ, కెర్, హర్మన్ బంతిని తిప్పగలరు. వికెట్లు తీయగలరు. ఈ సీజన్లో డెత్ ఓవర్లలో బెస్ట్ ఎకానమీ 5.29 ముంబయిదే.