WPL 2023, DC-W vs GG-W:


విమెన్‌ ప్రీమియర్‌ లీగులో గురువారం 14వ మ్యాచ్‌ జరుగుతోంది. దిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ బ్రబౌర్న్‌ వేదికగా తలపడుతున్నాయి. ఇందులో గెలిచి ప్లేఆఫ్‌కు మరింత దగ్గరవ్వాలని డీసీ భావిస్తోంది. రెండో విజయం అందుకోవాలని గుజరాత్‌ తహతహలాడుతోంది. మరి నేటి పోరులో గెలిచేదెవరు? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి?




ప్లేఆఫ్‌ రేసులో!


అరంగేట్రం సీజన్లో దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) ఎదురు లేకుండా దూసుకుపోతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో పటిష్ఠంగా ఉంది. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క మ్యాచులో ఓటమి చవిచూసింది. ఓపెనర్లు మెగ్‌లానింగ్‌ (Meg Lanning), షెఫాలీ వర్మ (Shafali Verma) మెరుపు ఆరంభాలు ఇస్తున్నారు. అలిస్‌ క్యాప్సీ, మారిజానె కాప్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. వికెట్లు పడకుండా సమయోచితంగా ఆడేందుకు జెమీమా రోడ్రిగ్స్‌ ఉంది. జెస్‌ జొనాసెన్‌, తానియా భాటియా, రాధా యాదవ్‌ సైతం షాట్లు ఆడగలరు. బౌలింగ్‌లోనూ డీసీని ఆపడం కష్టం. టారా నోరిస్‌, శిఖా పాండే, కాప్‌ పేస్‌ బౌలింగ్‌ చేస్తున్నారు. రాధా యాదవ్‌, క్యాప్సీ స్పిన్‌తో చెలరేగుతున్నారు. ఈ జట్టును అడ్డుకోవాలంటే ప్రత్యర్థి చాలా శ్రమించాలి.


రెండో విక్టరీ కోసం!


గుజరాత్‌ జెయింట్స్‌కు (Gujarat Giants) ఏం చేయాలో అర్థమవ్వడం లేదు. ఇప్పటి వరకు మూడు ఓపెనింగ్‌ పెయిర్స్‌ను మార్చారు. ఓపెనర్లు కుదురుకోవడం లేదు. నిలబడితే సోఫియా డంక్లీ సిక్సర్లతో చెలరేగగలదు. తెలుగమ్మాయి మేఘన తన స్థాయికి తగినట్టు పరుగులు చేయలేదు. హర్లీన్‌ డియోల్‌ (Harleen Deol) మాత్రమే ఆదుకొంటోంది. మంచి ఇంటెంట్‌తో ఆడుతోంది. ఇక ఫీల్డింగ్‌లోనూ మాయ చేస్తోంది. యాష్లే గార్డ్‌నర్‌, సుథర్‌ ల్యాండ్‌ పదేపదే విఫలమవుతున్నారు. హేమలత, స్నేహ రాణా (Sneh Rana), సుష్మా వర్మ త్వరగా ఔటవుతున్నారు. బౌలింగ్‌ వరకు జెయింట్స్‌ ఫర్వాలేదు. స్పిన్నర్లు, పేసర్లు బాగానే ఉన్నారు. అయితే పవర్‌ప్లే, డెత్‌ ఓవర్లలో ఎక్కువ స్కోర్‌ లీక్‌ చేస్తున్నారు.


తుది జట్లు


గుజరాత్‌ జెయింట్స్‌: సోఫీ డంక్లీ, మేఘన, హర్లీన్‌ డియోల్‌,  యాష్లే గార్డ్‌నర్‌, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అనబెల్‌ సుథర్‌ల్యాండ్‌, రాణా, తనుజా కన్వార్‌, కిమ్‌ గార్త్‌, మాన్సీ జోషీ


దిల్లీ క్యాపిటల్స్‌: మెగ్‌ లానింగ్‌, షెఫాలీ వర్మ, అలిస్‌ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్‌, మారిజానె కాప్‌,  జెస్‌ జొనాసెన్‌, అరుంధతీ రెడ్డి, తానియా భాటియా, శిఖా పాండే, రాధా యాదవ్‌, టారా నోరిస్‌