WPL 2023: జట్టు నిండా స్టార్ ప్లేయర్లు.. అవసరానికి ఆదుకునే ఆల్ రౌండర్లు.. ప్రపంచస్థాయి బ్యాటర్లు.. వనరులన్నీ పుష్కలంగా ఉన్నా వాటిని వాడటంలో విఫలమైందో లేక మరే కారణమో గానీ  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓడింది.  ‘ఇక వీళ్లు ఇంతే. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ సంగతి దేవుడెరుగు.. కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచినా చాలు’అని అభిమానులు అనుకునే స్థాయికి దిగజారింది ఆర్సీబీ అమ్మాయిల ఆట. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ స్మృతి మంధాన అండ్ కో. బుధవారం డబ్ల్యూపీఎల్‌లో సూపర్ విక్టరీ అందుకుంది. ఈ విజయం వెనుక ఆ జట్టుకు కోహ్లీ ఇచ్చిన స్ఫూర్తి టానిక్‌లా పనిచేసింది. 


విజయానికి స్ఫూర్తినిచ్చిన కోహ్లీ.. 


వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడటంతో ఆర్సీబీ ఆటగాళ్ల ముఖాల్లో రక్తమే కరువైంది. టాస్ కు వచ్చే సమయంలో కూడా మంధాన  నిరాశ నిస్పృహలతోనే వచ్చేది. అయితే నిన్న (బుధవారం) మాత్రం ఆ జట్టు ఫుల్ జోష్‌తో ఆడింది. యూపీ వారియర్స్ తో మ్యాచ్ కు ముందు కోహ్లీ ఆర్సీబీ క్యాంప్‌కు వచ్చాడు. అక్కడ ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ మెంబర్స్ తో ముచ్చటించాడు. వారిలో స్ఫూర్తినిచ్చాడు. నిన్నటి మ్యాచ్ లో సూపర్ స్టార్ కనిక అహుజా కూడా ఇదే విషయాన్ని చెప్పడం గమనార్హం.  


కోహ్లీ ఏం చెప్పాడు..? 


ఆర్సీబీ షేర్ చేసిన ఈ వీడియోలో కోహ్లీ.. ‘నేను పదిహేనేండ్లుగా ఐపీఎల్ ఆడుతున్నా. ఇంతవరకూ ఒక్కసారి కూడా నేను ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. కానీ అంతమాత్రానా నా ఆటను, నాలో ఉత్సాహాన్ని ఆ పరాజయాలు ఆపలేదు. నేను ఆడే ప్రతి మ్యాచ్, ప్రతి టోర్నీ గెలిచినట్లయితే అక్కడికే సంతోషించేవాడిని. కానీ అలా జరుగకూడదు. మీకు లభించిన అవకాశం ఎంత గొప్పదో  ఆలోచించుకోండి. మ్యాచ్ గెలిచామా, ట్రోఫీ అందుకున్నామా లేదా అన్నది కాదు. ఎలా ఆడామన్నదే ముఖ్యం. మేం ఇంతవరకూ ఐపీఎల్ నెగ్గకున్నా మాకు ప్రపంచంలోనే అత్యుత్తమ అభిమానగణం ఉంది.  ప్రతీసారి మనం కప్పు గెలుస్తామన్న హామీని ఇవ్వలేకపోవచ్చు. కానీ వారికి మనం 110 శాతం మన బెస్ట్ ఇవ్వగలమని హామీ ఇవ్వొచ్చు. ఈ టోర్నీలో ప్లేఆఫ్స్ చేరడానికి మనకు 1శాతం అవకాశం మాత్రమే ఉంది. కానీ కొన్నికొన్ని సార్లు అదే చాలా గొప్పది..’అని  అమ్మాయిల్లో స్ఫూర్తినింపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 






కాగా బుధవారం  యూపీ వారియర్స్ తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో  ఆర్సీబీ  ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ..   19.3 ఓవర్లలో  135 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం  ఆర్సీబీ తొలుత తడబడినా  కనిక అహుజా  (46), రిచా ఘోష్ (31 నాటౌట్) లు రాణించి  ఆ జట్టుకు తొలి విజయాన్ని అందించారు.  ఆర్సీబీ తమ తర్వాతి మ్యాచ్ ను గుజరాత్ జెయింట్స్ తో ఆడనుంది.